అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Test Match | ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బుధవారం ప్రారంభమైన రెండో టెస్ట్ (Second Test)లో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు.
ఐదు టెస్టుల అండర్సన్-సచిన్ ట్రోఫీ (Anderson-Sachin Trophy)లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను జోరుగా ప్రారంభించింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 85 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (216 బంతుల్లో 12 ఫోర్లతో 114 నాటౌట్) అజేయ శతకంతో నిలిచాడు. అతడికి రవీంద్ర జడేజా (67 బంతుల్లో 41 నాటౌట్) తోడయ్యాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ కేవలం 2(26 బంతుల్లో) పరుగులకే క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Test Match | శతకాల జోరు..
అయితే, ఈ దశలో యశస్వి జైస్వాల్ (107 బంతుల్లో 87; 13 ఫోర్లు) జట్టు పతనాన్ని అడ్డుకున్నాడు. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన కరుణ్ నాయర్ (31)తో కలిసి రెండో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) తన ఫామ్ కొనసాగిస్తూ 59 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
అయితే బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ (Karun Nair) అవుట్ అయ్యాడు. లంచ్ సమయానికి భారత్ 98/2తో నిలిచింది. లంచ్ అనంతరం జైస్వాల్ శతకం దిశగా సాగిపోతున్న సమయంలో, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ వేగంగా ఆడి స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు.
టీ బ్రేక్ సమయానికి భారత్ 182/3గా నిలిచింది. మూడో సెషన్‌లో శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) 125 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అదే సమయంలో పంత్ భారీ షాట్‌కి యత్నించి క్యాచ్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి (1)ని వోక్స్ ఔట్ చేయడంతో భారత్ 211 వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
ఈ దశలో గిల్‌కు జడేజా (Jadeja) అండగా నిలిచాడు. ఇద్దరూ పేస్, స్పిన్‌కు సమంగా స్పందిస్తూ అవసరమైన వేగంతో స్కోర్‌ను ముందుకు నడిపించారు. 80వ ఓవర్‌లో జో రూట్ బౌలింగ్‌లో బౌండరీతో గిల్ 199 బంతుల్లో తన ఏడో టెస్ట్ శతకం పూర్తి చేశాడు. ఇది ఈ సిరీస్‌లో అతడికి వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం.
చివరికి ఈ జోడీ 99 పరుగుల అజేయ భాగస్వామ్యంతో తొలి రోజు ఆటను ముగించింది. ఇంగ్లండ్ బౌలింగ్ విషయానికి వస్తే.. క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీసుకోగా, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ దక్కించుకున్నారు. మొత్తంగా మొదటి రోజు భారత జట్టు ధృడంగా నిలిచి మ్యాచ్‌పై ఆశలు కలిగించింది.