అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | దారిలో దిగిపోతామని లిఫ్ట్ అడిగి మార్గమధ్యలో దారిదోపిడీకి పాల్పడిన గ్యాంగ్‌ను అరెస్ట్ చేశామని కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) తెలిపారు.
పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 19న దోమకొండ మండలం (Domakonda mandal) చింతామన్ పల్లి గ్రామానికి చెందిన సార్ల చిన్న గంగయ్య పట్టణంలోని దుబ్బాగౌడ్ కల్లు దుకాణంలో కల్లు తాగాడు. అక్కడ ఓ మహిళ తనను క్యాసంపల్లి వద్ద దింపేయాలని కోరగా లిఫ్ట్ ఇచ్చాడు. బైక్‌పై వెళ్తుండగా మార్గమధ్యలో నవాబ్ వెంచర్ దాటిన తర్వాత బైక్ ఆపి మరొక ఇద్దరు వ్యక్తులు వచ్చి గంగయ్యను బెదిరించి అతని వద్ద ఉన్న రూ. 28వేల నగదు లాక్కుని పరారయ్యారు.
ఈ విషయమై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని ఏఎస్పీ తెలిపారు. విచారణ చేసిన అనంతరం ముగ్గురు నిందితులు కడమంచి లక్ష్మి, షేక్ జావిద్, షేక్ అబ్బులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ ముగ్గురు ఇదే తరహాలో గతంలో దేవునిపల్లి, మేడ్చల్ పోలీస్ స్టేషన్ల (Medchal police stations) పరిధిలో డబ్బులు దోచుకునే వారని వివరించారు. వీరి వద్ద నుంచి రూ. 14,770, బైకు, ఫిర్యాదుదారుడి పర్సు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. సమావేశంలో పట్టణ సీఐ నరహరి, సిబ్బంది పాల్గొన్నారు.