అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gutta Sukhender Reddy | ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం పాకులాడకూడదని, ప్రభుత్వాలు ఉచిత పథకాలను(Governments Free Schemes) నియంత్రించాలని అభిప్రాయపడ్డారు.
రాజకీయ నేతల భాష అత్యంత జుగుప్సాకరంగా ఉంటుందని, అది మార్చుకోవాలని హితవు పలికారు. నల్లగొండ(Nalgonda)లో సోమవారం విలేకరులతో గుత్తా మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగ పదవులను అందరూ గౌరవించాల్సి ఉందని, భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు ముందుగానే నీటి విడుదల చేయడం శుభ పరిణామమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి (Minister Uttam Kumar Reddy) ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Gutta Sukhender Reddy | జనం ఈసడించుకుంటున్నారు..
ఇటీవల రాజకీయ నాయకులు వాడే భాష చాలా ఘోరంగా ఉంటుందని గుత్తా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష, అధికార పక్షాలు అసభ్యకర, తప్పుడు భాషను వాడి ప్రజల ఈసడింపునకు గురి కావొద్దని సూచించారు. రాజ్యాంగ పదవులను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) ఇటీవల చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని గుత్తా ఇలా స్పందించారన్న భావన వ్యక్తమవుతోంది.
Gutta Sukhender Reddy | అవినీతిని అదుపు చేయాలి..
రాజకీయ పార్టీలు జాగ్రత్తగా ఉండాలని, ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని గుత్తా అభిప్రాయపడ్డారు. ఎన్నికలలో గెలుపు కోసం పార్టీలు వేల కోట్లు, అభ్యర్థులు వందల కోట్ల డబ్బులు ఖర్చుపెడుతున్నారని తెలిపారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ఇలా కోట్ల కొద్ది డబ్బు ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చాక దోచుకుంటున్నారన్నారు. దీంతో అన్ని రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోతోందని తెలిపారు. ఈ సంప్రదాయం మారాలని ఆయన ఆకాంక్షించారు. రాజకీయ పార్టీల వైఖరితో అధికారుల్లో అవినీతి పెరిగిందని గుత్తా తెలిపారు. ఎంత సంపాదించినా ఏం చేస్తారని, మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్లు వెంట ఏమన్నా తీసుకుయారా? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం, సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం అవినీతిపై దృష్టి సారించాలన్నారు.
Gutta Sukhender Reddy | పథకాలను తగ్గించుకోవాలి..
ఓట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలను కూడా నియంత్రించాల్సిన అవసరం ఉందని మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి (Gutta Sukhender Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలకు బదులు ప్రజలకు ఉపాధి కల్పించాలని సూచించారు. తెలంగాణ(Telangana)లో అన్ని పనులలో ఇతర రాష్ట్రాల వారే ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. చివరకు వసాయ కూలీలు కూడా బీహార్ లాంటి రాష్ట్రాల నుండి వస్తున్నారన్నారు. ఉచిత పథకాలకు ప్రజలను అలవాటు చేయడం సరికాదన్నారు. పథకాల కోసం ప్రజలు ప్రభుత్వం వైపునకు ఎదురుచూసే పరిస్థితి ఉండొద్దన్నారు. ఉచితాలు తగ్గించి ప్రజలకు పని కల్పించాలని హితవు పలికారు. అవినీతిపై కోర్టులు దృష్టి పెట్టాలి.
Gutta Sukhender Reddy | బనకచర్లకు వ్యతిరేకం..
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వనరుల వివాదం ఏర్పడడం సరికాదని గుత్తా అభిప్రాయపడ్డారు. నదుల అనుసంధానంతో ఇరు రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చ ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్రాస్‌కు నీళ్లు తీసుకుపోవడానికి ప్రాజెక్ట్‌ల అనుసంధానం జరిగిందన్నారు. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్‌కు (Nagarjuna Sagar) నీళ్లు వస్తే తెలంగాణకు మేలు జరుగుతుందని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టను (Banakacharla Project) తెలంగాణ గట్టిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు.
Gutta Sukhender Reddy | విజ్ఞతతో వ్యవహరించాలి..
ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna), కల్వ కుంట్ల కవిత (Kalva Kuntla Kavitha) వివాదంపై మండలి ఛైర్మన్ స్పందించారు. శాసన మండలిలో ఎమ్మెల్సీల మధ్య గొడవ జరగలేదని, బయట జరిగిన గొడవ కాబట్టి దానిపై చట్ట పరంగా ఎలా వ్యవహారించాలి అనే దాన్ని బట్టి ఆలోచిస్తామని చెప్పారు. వారు ఇద్దరు పరస్పరం ఫిర్యాదులు చేశారని, ఇరువురు విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు.