అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Krishna River | ఎగువన వర్షాలు తగ్గడంతో కృష్ణమ్మ శాంతించింది. మొన్నటి వరద నీరు పోటెత్తడంతో కృష్ణా నది (Krishna River ) పరవళ్లు తొక్కిన విషయం తెలిసిందే. అయితే ఎగువన వర్షాలు తగ్గడంతో నదికి వరద తగ్గింది.
దీంతో తెలంగాణలోని గద్వాల జిల్లాలో గల జూరాల ప్రాజెక్ట్ (Jurala Project)కు ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం జలాశయంలోకి 65 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఒక గేటు ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ నుంచి మొత్తం 47,068 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదవుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.730 మీటర్లకు చేరింది.
Krishna River | శ్రీశైలం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న ప్రవాహం
జూరాల ప్రాజెక్ట్ నుంచి వస్తున్న నీరు శ్రీశైలం జలాశయానికి (Srisailam Project) చేరుకుంటుంది. దీంతో ప్రాజెక్ట్ ఒక్క గేటు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం 73,586 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా కరెంట్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో ప్రాజెక్ట్ నుంచి 95,677 క్యూసెక్కుల నీరు నాగర్జున సాగర్‌వైపు పరుగులు పెడుతోంది.
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.30 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి విడదల చేసిన నీరు నాగార్జున సాగర్ (Nagarjuna Sagar)కు చేరుకుంటుంది. ఆ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 210 టీఎంసీలు దాటింది.