అక్షరటుడే, వెబ్‌డెస్క్: Godavari River | గోదావరి వరద పోటెత్తింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తుండడంతో దిగువన గోదావరికి భారీగా వరద వస్తోంది. భద్రాచలం వద్ద క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 33.5 అడుగుల వద్ద నది ప్రవహిస్తోంది. శబరి, ప్రాణహిత, సీలేరు ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి వరకు భద్రాచలం (Bhadrachalam) వద్ద నీటిమట్టం 40 అడుగులకు చేరే అవకాశం ఉంది. నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.
Godavari River | ఎగువన వెలవెల..
గోదావరి మహారాష్ట్ర నుంచి తెలంగాణ (Telangana)లోకి ప్రవేశిస్తుంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి (Kandakurthi) వద్ద గోదావరి తెలంగాణలో ప్రవేశిస్తుంది. ఇక్కడే గోదావరిలో మంజీర, హరిద్ర నదులు కలుస్తాయి. అయితే ఎగువన వర్షాలు లేవు. దీంతో మంజీర, గోదావరి నదులకు ప్రవాహం లేక వెలవెలబోతున్నాయి. తెలంగాణలో గోదావరిపై మొదట శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది. అయితే వరదలు లేకపోవడంతో ప్రాజెక్ట్‌లోకి స్వల్ప ఇన్‌ఫ్లో మాత్రమే వస్తోంది. అయితే ఏటా ఈ ప్రాజెక్ట్‌కు ఆగస్టు, సెప్టెంబర్‌లో వరదలు ఎక్కువగా వస్తాయి.
Godavari River | సముద్రం పాలవుతున్న నీరు
దిగువన గోదావరి(Godavari) ఉప్పొంగి ప్రవహిస్తున్నా.. ఆ నీటిని ఒడిసి పట్టుకోవడానికి ప్రాజెక్ట్‌లు లేకపోవడంతో సముద్రం పాలవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుతం నీటిని ఎత్తిపోయడం లేదు. మరోవైపు ఏపీలోని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో లక్షల క్యూసెక్కుల నీరు దవళేశ్వరం బ్యారేజీ (Davaleswaram Barrage) నుంచి సముద్రంలో కలుస్తోంది.
Godavari River | బోసిపోయిన ప్రాజెక్ట్‌లు
గోదావరి, మంజీరలకు వరదలు లేకపోవడంతో ఆ నదులపై గల ప్రాజెక్టులు బోసిపోతున్నాయి. ఓ వైపు కృష్ణా నది(Krishna River)పై గల జురాల, శ్రీశైలం ఇప్పటికే నిండుకుండలా మారాయి. మరో వారం రోజుల్లో నాగర్జున సాగర్ గేట్లు కూడా తెరుచుకోనున్నాయి. నాగార్జున సాగర్ నిండితే నీటిని ఏపీలోని పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేయనున్నారు. అయితే గోదావరి నదిపై గల ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు ప్రస్తుతం ప్రవాహం లేక బోసిపోయాయి. అలాగే మంజీరపై గల సింగూరు, నిజాంసాగర్‌కు వరదలు రావడం లేదు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు నీరు అందించే మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంలు సైతం నీరు లేక వెలవెలబోతున్నాయి. దిగువన మాత్రం గోదావరి ఉప్పొంగి లక్షల క్యూసెక్కులు సముద్రం పాలవుతున్నాయి.