అక్షరటుడే, వెబ్‌డెస్క్:Flipkart | ప్రముఖ ఈకామర్స్ కంపెనీ అయిన ఫ్లిప్‌కార్ట్(Flipkart). ఇకపై తన కస్టమర్లకు నేరుగా రుణాలు ఇవ్వనుంది. దీనికి సంబంధించి ఆర్‌బీఐ(RBI) నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) లైసెన్స్‌ను మంజూరు చేసింది.
ప్రస్తుతం ఈకామర్స్ కంపెనీలు యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌ల భాగస్వామ్యంతో వ్యక్తిగత రుణాలు అందిస్తున్నాయి. బై నౌ, పే లాటర్ సౌకర్యంతోపాటు ఈఎంఐ సేవలు అందిస్తున్నాయి. కానీ ఆర్‌బీఐ ఇప్పటివరకు ఏ ఈకామర్స్ సంస్థకు ఎన్‌బీఎఫ్‌సీ(NBFC) లైసెన్స్ ఇవ్వలేదు. తొలిసారిగా ఫ్లిప్‌కార్ట్‌కు లైసెన్స్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ ధ్రువీకరించింది. ఈ లైసెన్స్ కోసం 2022లోనే ఆర్‌బీఐకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. కాగా ఆర్‌బీఐ ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్ రావడంతో ఆ సంస్థ తన ఫ్లాట్‌ఫామ్‌నుంచి కస్టమర్లకు నేరుగా అప్పులు ఇవ్వడానికి మార్గం సుగుమమైంది.
అయితే డిపాజిట్‌లను స్వీకరించడానికి అవకాశం లేదు. ఫ్లిప్‌కార్ట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్(NBFC license) మంజూరయ్యింది. ఈ లైసెన్స్‌తో ఫ్లిప్‌కార్ట్ తన ఫిన్‌టెక్ యాప్ ‘సూపర్ మనీ(Super money) ’ ద్వారా కూడా రుణాలు అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ బాటలోనే అమెజాన్(Amazon) కూడా పయనిస్తోంది. ఆ సంస్థ ఇప్పటికే యాక్సియో అనే ఎన్‌బీఎఫ్‌సీ సంస్థను కొనుగోలు చేసింది. అమెజాన్‌కు కూడా త్వరలోనే ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్ లభించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్(Walmart)కు 80 శాతానికిపైగా వాటా ఉంది. ఆ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను భారత్‌లోని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం సింగపూర్‌లో ఉన్న హోల్డింగ్ కంపెనీ భారత్‌లోకి మారుస్తోంది. ఈ నేపథ్యంలో లభించిన ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్ ఆ సంస్థకు ఫిన్‌టెక్ విస్తరణలో ముందడుగుగా భావిస్తున్నారు.