అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bihar | బీహార్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన ఆందోళన కలిగిస్తోంది. మూఢనమ్మకాల పేరిట ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఐదుగురిని గ్రామస్థులు దారుణంగా కొట్టి, అనంతరం కాల్చి చంపారు. ఈ హృదయ విదారక సంఘటన పూర్ణియా జిల్లా(Purnia District) గిరిజన ప్రాంతమైన ఓ గ్రామంలో జూలై 7వ తేదీన చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే గతంలో ఈ గ్రామంలో అనేక మంది అనారోగ్యంతో మృతి చెందారు. దీనికి బాబులాల్ ఓరాన్ అనే వ్యక్తి కుటుంబం చేతబడి, క్షుద్రపూజలు చేస్తోందనే అనుమానంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో ఒక్కసారిగా వారు దాడికి దిగారు. బాబులాల్ ఓరాన్, సీతా దేవి, మంజీత్ ఓరాన్, రానియా దేవి, తప్తో మోస్మత్ అనే ఐదుగురిపై కర్రలతో విరుచుకుపడి, దారుణంగా హత్యచేసి, మృతదేహాలకు నిప్పంటించారు.
Bihar | గ్రామస్థుల చేతిలో..
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమీపంలోని చెరువులో పడేసిన కాలిన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటన అనంతరం గ్రామస్థులు గ్రామం విడిచి పారిపోయారు. ప్రస్తుతం గ్రామం నిర్మానుష్యంగా మారిపోయింది. ఈ దాడిలో బాబులాల్ కుటుంబానికి చెందిన ఓ బాలుడు మాత్రం ప్రాణాలతో బయటపడినట్టు పోలీసులు (Bihar Police) తెలిపారు. అతను గ్రామస్థులే తమ కుటుంబాన్ని హత్య చేశారన్న వివరాలను చెప్పాడు. కానీ తీవ్ర భయాందోళనలో ఉండడంతో ఇంకా పూర్తి సమాచారం చెప్పలేకపోయాడని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని తెలుస్తోంది.
జనాన్ని రెచ్చగొట్టిన నిందితుడు నకుల్ కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యల వెనుక మంత్ర, తంత్రాల మూఢనమ్మకాలు ప్రధాన కారణమని పూర్ణియా ఎస్పీ స్వీటీ సెహ్రావత్(Purnia SP Sweety Sehrawat) ధృవీకరించారు. ప్రస్తుతం డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేయడంతో పాటు పోలీసులు గ్రామంలో కూంబింగ్(Coombing), గస్తీ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ తీవ్రంగా స్పందించారు. “రెండు రోజుల క్రితం సివాన్‌లో ముగ్గురిని, అలాగే బక్సర్, భోజ్‌పూర్‌లలో మూడేసి హత్యలు జరిగాయి. రాష్ట్రంలో నేరగాళ్లు చురుగ్గా తిరుగుతున్నారు, కానీ ముఖ్యమంత్రి స్పృహలో లేరు,” అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ఘటన మూఢనమ్మకాల పట్ల సమాజంలో ఇంకా ఎంత తీవ్రమైన భావనలు ఉన్నాయి అనే దానిపై ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన తర్వాత సమాజంలో అవగాహన తప్పనసరి అవసరమన్న వాదనలు మరింత బలపడుతున్నాయి.
Read all the Latest News on Aksharatoday.in