అక్షరటుడే, వెబ్‌డెస్క్: Air India Flight | ఎయిర్ ఇండియా (Air India) విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Delhi Airport) మంగళవారం చోటు చేసుకుంది. హాంకాంగ్ నుంచి ఢిల్లీ వచ్చిన విమానంలో ల్యాండ్ అయిన కొద్ది సేపటికే మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
హాంకాంగ్ నుంచి ఢిల్లీ వచ్చిన విమానం ల్యాండ్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. పార్కింగ్ గేట్ వద్దకు చేరుకున్న తర్వాత సహాయక విద్యుత్ యూనిట్లో (APU) మంటలు చెలరేగాయి. ఇంజిన్లు ఆపేసిన తర్వాత విమానానికి ఏపీయూ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. ప్రయాణికులు విమానం నుంచి దిగే సమయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ఘటనలో విమానానికి కొంత నష్టం జరిగినప్పటికీ.. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Air India Flight | వరుస ఘటనలతో ఆందోళన
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన (Ahmedabad Plane Crash) విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 270 మంది మృతి చెందారు.
ఈ ప్రమాదం తర్వాత దేశంలో విమానాలకు సంబంధించి వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం కొచ్చి నుంచి ముంబై వచ్చిన విమానం ముంబైలో ల్యాండ్ అవుతుండగా.. రన్‌వేపై (Plane Skid on Runway) జారిపోయింది. ఈ ఘటనలో విమానం మూడు టైర్లు పగిలిపోగా.. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. అయితే వరుస ఘటనలతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
సాంకేతిక సమస్యలతో విమానాలు రన్‌వేపై నిలిచిపోవడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Emergency Landing) చేస్తుండడంతో ఫ్లైట్ ఎక్కాలంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇటీవల ఓ విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య రావడంతో పైలట్ పాన్ కాల్ ఇచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇలాంటి ఘటనలతో విమాన ప్రయాణికులు భయపడుతున్నారు. విమానాలను ముందుగానే పూర్తిగా తనిఖీ చేసి ప్రయాణానికి అనుమతించాలని కోరుతున్నారు.