అక్షరటుడే, వెబ్‌డెస్క్: Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. రాష్ట్రంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాలను (MPTC and ZPTC seats) ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 566 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు, 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు లెక్క తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న తరుణంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
Local Body Elections | సెప్టెంబర్ లోపు పూర్తి చేసేలా..
రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలవర్గాల పదవీకాలం ముగిసిపోయి ఏడాది దాటి పోయింది. వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ప్రభుత్వం సుముఖత చూపలేదు. ప్రత్యేకాధికారులను (Special officers) నియమించి పల్లెల్లో పాలనను కొనసాగిస్తోంది. దీనిపై కొందరు మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే తమను సర్పంచులుగా కొనసాగించాలని పిటిషన్లు వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని (Election Commission) ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Local Body Elections | ముందుగా ఎంపీటీసీ, జడ్జీటీసీ ఎన్నికలు..
స్థానిక పోరుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ముందుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు (Mandal and Zilla Parishad elections) నిర్వహించాలని యోచిస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పూర్తి చేశాకే, పంచాయతీ సమరానికి తెర తీయాలని భావిస్తోంది. ఈ మేరకు సన్నాహాలు చేపట్టింది. అందులో భాగంగానే తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను ఖరారు చేసింది. హైకోర్టు (High Court) ఆదేశాల నేపథ్యంలో ముందుగా పరిషత్ ఎన్నికలు పూర్తి చేసి, ఆ తర్వాతే సర్పంచుల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది.
Local Body Elections | రిజర్వేషన్ల లెక్క తేలితేనే..
స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం బీసీ రిజర్వేషన్లపై (BC reservations) ఆధారపడి ఉంది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వం ఇప్పటికే బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం కోటా కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించింది. మరోవైపు, హైకోర్టు గడువు విధించిన సమయం దగ్గర పడుతుండడంతో, బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇది ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ ఆయన సంతకం చేయకపోతే మాత్రం సందిగ్ధ పరిస్థితి ఏర్పడుతుంది. బీసీ కోటా తేల్చాకే ఎన్నికలు నిర్వహించాలని వెనుకబడిన వర్గాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.