అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) స్పష్టం చేశారు. మాక్లూరు మండలం అమ్రాద్ గ్రామంలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్‌ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల్లో ఉన్న విధంగా ఎరువుల నిల్వలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఎవరూ యూరియా (urea) కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి స్థాయిలో స్టాక్ అందుబాటులో ఉందని అందరికీ అందేలా ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తున్నామన్నారు.
Nizamabad Collector | తహశీల్దార్ కార్యాలయం తనిఖీ
మాక్లూరులోని తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను (Makloor Tahsildar and MPDO offices) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను కేటగిరీల వారీగా విభజిస్తూ.. ఆన్లైన్లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన, ఆమోదం తదితర అంశాల గురించి తహశీల్దార్ శేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు (seasonal diseases) ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం చిన్నాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.
Nizamabad Collector | మొక్కల నిర్వహణపై అసంతృప్తి
అమ్రాద్ తండా కాలువ (Amrad Thanda canal) గట్టు మీద వనమోత్సవంలో భాగంగా గతేడాది నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. మొక్కల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ అమలు చేస్తుంటే క్షేత్రస్థాయిలో నిర్వహణను పట్టించుకోకపోతే ఎలా అని సంబంధిత అధికారులను మందలించారు. నాటిన ప్రతి మొక్క బతికేలా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.