అక్షరటుడే, వెబ్‌డెస్క్: Inflation Rate | రాష్ట్రంలో ద్రవ్యోల్బణం తగ్గింది. జూన్ నెలకు సంబంధించి –0.93 శాతం ద్రవ్యోల్బణం నమోదు అయింది. సాధారణంగా ఇన్ఫ్లేషన్ పెరిగితే రేట్లు పెరుగుతాయి. అయితే ఇన్ఫ్లేషన్ సున్న శాతం ఉంటే గతంలో ఉన్న రేట్లు కొనసాగుతాయని అర్థం. అయితే ద్రవ్యోల్బణం(Inflation) మైనస్‌లోకి వెళ్లడంతో రేట్లు దిగివస్తాయి. రేట్లు తగ్గితే మంచిదే కదా అనుకుంటున్నారా.. కానీ ఆర్థిక వ్యవస్థకు మాత్రం మంచిది కాదు అంటున్నారు నిపుణులు.
Inflation Rate | దేశవ్యాప్తంగా 2.10శాతం
దేశవ్యాప్తంగా జూన్ నెలలో సగటు ద్రవ్యోల్బణం 2.10 శాతంగా నమోదు అయింది. కేరళ 6.71శాతంలో తొలిస్థానంలో ఉండగా.. పంజాబ్ 4.67, ఉత్తరాఖండ్ 3.40శాతంతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో సున్నశాతం ద్రవ్యోల్బణం నమోదు కాగా తెలంగాణ (Telangana)లో మైనస్ 0.93 కావడం గమనార్హం. మైనస్‌లోకి వెళ్లిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం –1.54శాతం, పట్టణ ప్రాంతాల్లో –0.45శాతంగా ఉంది.
Inflation Rate | డిమాండ్ తగ్గడంతో..
సాధారణంగా వస్తువులకు డిమాండ్ పెరిగితే రేట్లు పెరుగుతాయి. డిమాండ్ మేరకు ఉత్పత్తి లేకున్నా.. ధరలు పెరుగుతాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ద్రవ్యోల్బణం మైనస్(Inflation Minus)లోకి పోవడానికి డిమాండ్ తగ్గడమే కారణమని విశ్లేషకులు అంటున్నారు. అన్ని రంగాల్లో డిమాండ్ తగ్గిందని దీంతోనే ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు. అయితే ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంత మాత్రం మంచిది కాదని అభిప్రాయ పడుతున్నారు. దీంతో పెట్టుబడులు, పన్నులు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆదాయం కూడా తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.