అక్షరటుడే, వెబ్డెస్క్: MLC Kavitha | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు. బుధవారం ఆమె ఖమ్మంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం అవుతోందన్నారు. అయితే ముందు బీసీ రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ (BC Declaration)లో సైతం ఈ విషయాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. తర్వాత తాము ఒత్తిడి చేస్తే అసెంబ్లీలో బిల్లు పెట్టారన్నారు. బిల్లు పాస్ కాగానే చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. బిల్లు ఢిల్లీకి పంపామని.. ఇప్పుడు ఎన్నికలు పెట్టుకుంటామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీసీ బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జులై 17న రైల్ రోకో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. బీసీ బిల్లు ఆమోదం పొందే వరకు ఎన్నికలు పెట్టొద్దన్నారు. బీసీ బిల్లులు ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి చేయాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.