అక్షరటుడే, హైదరాబాద్: Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఇప్పటి వరకు 29 మంది సినీ తారలపై కేసు నమోదు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ వారిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఈడీ అక్రమ బెట్టింగ్ యాప్‌ల Betting apps ప్రమోషన్ కేసు నమోదు చేసింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మియాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త పి.ఎం. ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
Betting Apps Case : ఈడీ కేసు..
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రముఖులు అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేశారని ఫణీంద్ర శర్మ ఆరోపించారు. డఫాబెట్, 1XBET, బెట్‌వే లాంటి యాప్‌లు ద్వారా రూ. వేల కోట్లు చలామణి అవుతున్నాయి. ఈ యాప్‌లు డబ్బు సంపాదన ఆశ చూపుతూ ప్రజలను జూద వ్యసనంలోకి లాగుతున్నాయని పేర్కొన్నారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నాయని తెలియజేశారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసారన్న కారణంతో గతంలో సినీ ప్రముఖులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి ఉన్నారు.
ఇక, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపైనా కొరఢా ఝలిపించారు. వీరిపైనా కేసులు నమోదు చేశారు. వీరిలో నీతూ అగర్వాల్, వర్షిణి, విష్ణు ప్రియ, సిరి హనుమంతు, శోభా శెట్టి, అమృత చౌదరి, వసంతి కృష్ణన్, నయని పావని, పద్మావతి, నేహా పఠాన్, పండు, ఇమ్రాన్ ఖాన్, బయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, టేస్టీ తేజ, బండారు సుప్రీత ఉండడం గమనార్హం.
ఆ కేసుల ఆధారంగానే ఈడీ వారిపై కేసు నమోదు చేస్తూ… వీరందరినీ పీఎమ్ఎల్ఏ కింద విచారణ చేయనున్నారు. ఇక విచారణ సమయంలో అందరి స్టేట్‌మెంట్స్ ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు. ఈ కేసు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్‌లు 318(4), 112 r/w 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్‌లు 3, 3(A), 4, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 66(D) కింద నమోదు అయింది. కాగా, విశాఖపట్నానికి చెందిన ఒక బాధితుడు రూ.3.09 కోట్లు నష్టం చవిచూశారు. ఈ బెట్టింగ్ యాప్‌ల వల్ల సమాజంలో తీవ్ర ఆర్థిక, మానసిక ప్రభావాలు చూపుతున్నట్టుగా అర్ధమవుతుంది. ఏది ఏమైనా ఈ కేసు ప్రస్తుతం టాలీవుడ్‌లో Tollywood పెద్ద చర్చనీయాంశంగా మారింది.