అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆర్థిక అవకతవకలకు పాల్పడిన జెన్సోల్ ఇంజినీరింగ్ ప్రాంగణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం దాడులు నిర్వహించింది. అలాగే, ఢిల్లీలోని ఒక హోటల్లో దాక్కున్న కో-ప్రమోటర్ పునీత్ సింగ్ జగ్గీని అదుపులోకి తీసుకుంది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల కింద ఢిల్లీ, గురుగ్రామ్, అహ్మదాబాద్లోని కంపెనీ ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి. ప్రమోటర్ అన్మోల్ జగ్గీ దుబాయ్లో ఉండగా, ఢిల్లీ హోటల్లో ఉన్న సహా ప్రమోటర్ పునీత్ జగ్గీని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధులు సేకరించిన ప్రమోటర్లు వాటిని మళ్లించి జల్సాలకు వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సెబీ విచారణ చేపట్టగా, అనేక అక్రమాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రమోటర్ సోదరులు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ నిఘా ఉంచింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఈపీసీ కాంట్రాక్టుల సేకరణ కోసం జెన్సోల్ ఇంజనీరింగ్.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇరెడా లిమిటెడ్ నుంచి రుణాలు పొందింది. అయితే, ఈ నిధులను ప్రమోటర్లు, వారి బంధువుల వ్యక్తిగత పేరుతో లేదా గ్రూప్ స్థాపించిన వివిధ షెల్ సంస్థలలో ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన ప్రయోజనాల కోసం ఈ నిధులను ఉపయోగించకుండా మళ్లించింది. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా దాడులు నిర్వహించింది.