అక్షరటుడే, వెబ్‌డెస్క్: Eagle Team | రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగింది. గత పదేళ్లలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం గంజాయి విక్రయాలు పెరిగాయి. గతంలో పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన గంజాయి, డ్రగ్స్ ప్రస్తుతం మారుమూల ప్రాంతాలకు విస్తరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఎంతోమంది యువత వీటికి బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చడానికి చర్యలు చేపడుతామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ ఆట కట్టించడానికి ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఎక్కడ గంజాయి కనిపించినా ఈ గద్ద(ఈగల్) వాలిపోతుందని గతంలో సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు ఇటీవల ఈగల్ టీం పోలీసులు (Eagle Team police) హైదరాబాద్ నగరంలో దాడులు చేపడుతున్నారు. గంజాయి, డ్రగ్స్ విక్రేతలు, కొనేవారికి చుక్కలు చూపిస్తున్నారు.
Eagle Team | గంజాయి కొనుగోలుకు కోడ్ భాష
ఈగల్ టీం ఇటీవల కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్‌పై (Malnadu restaurant) దాడి చేసి, పెద్ద డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసిన విషయం తెలిసిందే. ఈ రెస్టారెంట్ యజమాని సూర్య పలువురు పబ్ యజమానులతో కలిసి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. తాజాగా ఈగల్ టీం 2 గంటల వ్యవధిలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి 14 మంది గంజాయి వినియోగదారులను పట్టుకుంది. అయితే వీరు గంజాయి విక్రయించడానికి ‘‘బాయి బచ్చ ఆ గయా బాయి’’ అనే కోడ్ భాషను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Eagle Team | ఐటీ కారిడార్‌లో ఆపరేషన్
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ అయిన గచ్చిబౌలిలో ఈగల్ టీం అధికారులు ఆదివారం డెకాయ్ ఆపరేషన్ (decoy operation) నిర్వహించారు. ఇటీవల గంజాయి విక్రేతను అరెస్ చేసిన పోలీసులు.. అతని ఫోన్ నుంచి ‘‘బాయి బచ్చ ఆ గయా బాయి’’ అని మేసేజ్ పంపారు. దీంతో గంజాయి కొనుగోలు చేయడానికి 14 మంది వచ్చారు.
గచ్చిబౌలి హెచ్డీఎఫ్సీ బ్యాంకు సమీపంలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఎక్కువ మంది 20 ఏళ్లలోపు వారు ఉండటం గమనార్హం. వీరిలో నలుగురు ఐటీ ఉద్యోగులు, ఒక విద్యార్థి, ఒక ట్రావెల్ ఏజెన్సీ యజమాని కూడా ఉన్నారు. వారికి పరీక్ష నిర్వహించగా గంజాయి తీసుకున్నట్లు తేలింది.
Eagle Team | గంజాయి కోసం నాలుగేళ్ల బిడ్డతో..
ఓ జంట తమ నాలుగేళ్ల బిడ్డతో కలిసి గంజాయి కొనడానికి వచ్చారు. వారిని చూసి ఈగల్ టీం సభ్యులే షాక్ అయ్యారు. మరో ఇద్దరు దంపతులు సైతం గంజాయి కొనడానికి రాగా.. అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారికి పరీక్షలు చేయగా గంజాయి తీసుకున్నట్లు తేలింది. కాగా.. ప్రధాన నిందితుడు, మహారాష్ట్రకు చెందిన వ్యాపారి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే అతడు వంద మందికి పైగా కస్టమర్లకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.