అక్షర టుడే, వెబ్‌డెస్క్: Ration Cards | రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈనెల 25 నుంచి ఆగస్టు 10లోపు రేషన్ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. ఈ మేరకు సోమవారం డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, సీఎస్‌లతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీసీలో మాట్లాడారు.
భారీ వరాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రేషన్ కార్డుల పంపిణీ (ration cards distribution), సాగునీటి వనరులు, ఎరువుల పంపిణీ పర్యవేక్షణ, సీజనల్ వ్యాధుల నియంత్రణ, తదితర అంశాలపై కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 96.95లక్షల రేషన్‌కార్డులున్నాయని, అన్ని మండలకేంద్రాల్లో కొత్త కార్డుల పంపిణీ అధికారికంగా చేపట్టాలని, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జి మంత్రులు, విధిగా పాల్గొనాలని సూచించారు. ఈ మేరకు కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలన్నారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ కమిషనరేట్ల (police commissionerates) ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. జిల్లాల్లో పిడుగుపాటు నష్టాల వివరాలు సత్వరమే నమోదు చేసి, బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూడాలన్నారు.
ఇక, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్లకు సూచించారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా, పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎరువుల దుకాణాల వద్ద స్టాక్ వివరాలు తెలిపే బోర్డు ఏర్పాటు చేయాలని, స్టాక్ వివరాలు ఆన్‌లైన్‌లో నిశిత పరిశీలన చేయాలన్నారు. ఎరువుల పంపిణీకి సంబంధించి ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి (Collector T Vinay Krishna Reddy), అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.