అక్షరటుడే, వెబ్‌డెస్క్:Article 21 | రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (article 21) ప్రకారం పౌరులకు డిజిటల్ యాక్సెస్(Digital Access) అనేది జీవించే హక్కులో ముఖ్యమైనదని సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టం చేసింది. దివ్యాంగులకు కూడా డిజిటల్ యాక్సెస్ ఇవ్వాల్సిందేనని, అందుకోసం ప్రభుత్వ విధానాల్లో మార్పులు చేయాలని సూచించింది.
దృష్టిలోపాలు, ఫేషియల్ సమస్యలు ఉన్న వారికి, దివ్యాంగులకు సంబంధించిన డిజిటల్ నో యువర్ కస్టమర్ (Know Your Customer) ప్రక్రియలో మార్పులు చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(Article 21) ప్రకారం డిజిటల్ యాక్సెస్ జీవించే హక్కులో ముఖ్యమైనదని జస్టిస్ జెబి పార్దివాలా, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లు, విద్యా వేదికలు, ఆర్థిక సాంకేతిక సేవలను దివ్యాంగులకు, అణగారిన వర్గాలకు అందుబాటులో ఉంచాలని కోర్టు ఆదేశించింది.
దివ్యాంగులకు డిజిటల్ యాక్స్‌స్, ఇతర సేవలు పొందలేక పోతున్న అంశాన్ని కొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. దివ్యాంగులకు డిజిటల్ సేవలు(Digital Services) అందించకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది.
డిజిటల్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, కంటెంట్‌ను పొందడంలో అనేక అసమానతలు ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) తెలిపింది. వికలాంగులకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు, సీనియర్ సిటిజన్లకు, ఆర్థికంగా బలహీన వర్గాలకు, భాషాపరమైన మైనారిటీలకు కూడా డిజిటల్ యాక్సెస్ నుంచి మినహాయించడం సరికాదని పేర్కొంది.
రాజ్యాంగ, చట్టబద్ధమైన నిబంధనలు పిటిషనర్లకు తగిన వసతితో ప్రాప్యత, సమగ్ర డిజిటల్ KYC ప్రక్రియలను డిమాండ్ చేసే చట్టపరమైన హక్కును మంజూరు చేస్తున్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ, ఆరోగ్య సంరక్షణ వంటి ముఖ్యమైన సేవలు డిజిటల్ మార్గాల ద్వారా ఎక్కువగా అందిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. ఈ సాంకేతిక పరిణామాల దృష్ట్యా జీవించే హక్కును అర్థం చేసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను పొందేలా చూసుకోవడానికి, అందరు పౌరుల గౌరవం, హక్కులను నిలబెట్టడానికి డిజిటల్ అంతరాన్ని తగ్గించడం తప్పనిసరి అని వ్యాఖ్యానించింది.