అక్షరటుడే, వెబ్‌డెస్క్: ACB Trap | అవినీతి అధికారుల తీరు మారడం లేదు. ప్రజలను లంచాల కోసం వేధిస్తూనే ఉన్నారు. ఆపరేటర్ (Operator) నుంచి మొదలు పెడితే ఐఏఎస్ (IAS) అధికారుల వరకు లంచాల పేరిట ప్రజలను పట్టి పీడిస్తున్నారు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) జరుగుతున్నా.. భయపడకుండా లంచాలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరు పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
ఓ ప్రభుత్వ అధికారి ఏకంగా రూ. 90 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటన పెద్దపల్లిలో వెలుగుచూసింది. పెద్దపల్లి సబ్ డివిజన్ & జిల్లా పంచాయతీరాజ్ శాఖ విభాగపు ఉప కార్యనిర్వహణ ఇంజినీరు కార్యాలయంలో ఎలిగేడు మండలం సహాయక ఇంజినీరు పి. జగదీష్ బాబు విధులు నిర్వర్తిస్తున్నాడు. దీనికితోడు కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాలకు ఇంఛార్జిగా ఉన్నాడు.
కాగా, ఫిర్యాదుదారుడు తాను పూర్తి చేసిన సీసీ రోడ్డు పనులను కొలతల పుస్తకంలో నమోదు చేసి, పెద్దపల్లి సబ్ డివిజన్ ఉప కార్యనిర్వహణ ఇంజినీరుకు పంపించేందుకు రూ. లక్ష డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో అనిశా అధికారులు వల పన్నారు. ఈ మేరకు సదరు అవినీతి అధికారికి బాధితుడు రూ. 90 వేల లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ACB Trap | భయపడకుండా ఫిర్యాదు చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని తెలుపుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.