అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. ప్రజలను లంచాల కోసం వేధిస్తూనే ఉన్నారు. ఆపరేటర్ (Operator) నుంచి మొదలు పెడితే ఐఏఎస్ (IAS) అధికారుల వరకు లంచాల పేరిట ప్రజలను పట్టి పీడిస్తున్నారు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) జరుగుతున్నా.. భయపడకుండా లంచాలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా రైతుల (Farmers) నుంచి లంచం తీసుకుంటూ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహశీల్దార్ ఏసీబీకి చిక్కారు.
సంగారెడ్డి (Sangareddy) జిల్లా జహీరాబాద్‌లో జాతీయ పెట్టుబడులు, తయారీ మండలం (NIMZ) కోసం గతంతో రైతుల నుంచి భూమి సేకరించారు. ఇందుకు సంబంధించి రైతులకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. అయితే పరిహారం చెక్కులు మంజూరు చేసేందుకు నిమ్జ్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాజారెడ్డి (Deputy Collector Rajareddy), డిప్యూటీ తహశీల్దార్ సతీశ్ లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ వ్యక్తికి మంజూరైన రూ.52,87,500 చెక్కును అందజేసేందుకు వీరు రూ.50 వేల లంచం అడిగారు. దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో గురువారం రూ.15 వేల లంచం తీసుకుంటుండగా.. ఏబీసీ అధికారులు డిప్యూటీ కలెక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ సతీశ్, డ్రైవర్ దుర్గయ్యను పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ACB Trap | భయపడకుండా ఫిర్యాదు చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని తెలుపుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.