అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi : కాలం చెల్లిన వాహనాల విషయంలో ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుని, ఆ వెంటనే వెనుకడుగు వేసింది. వాటికి బంకుల్లో ఇంధనం పోయడం నిషేధించాలని (Delhi Fuel Ban) తీసుకున్న నిర్ణయంపై పున:రాలోచనలో పడింది.
Delhi : ఆచారణ సాధ్యం కాదని..
పాత వాహనాలను గుర్తించి వాటికి ఇంధనం నిలిపివేసే వ్యవస్థ ఇప్పట్లో ఆచరణ సాధ్యం కాదని గుర్తించింది. ఇందుకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్కు (Commission for Air Quality Management - CAQM) ఢిల్లీ సర్కారు లేఖ పంపింది. తాజా నిర్ణయంతో ఢిల్లీలో పాత వాహనాల యజమానులకు ఊరట లభించింది.
“కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం నిలిపివేయడాన్ని తక్షణమే నిలిపివేయాలి.. ఈ మేరకు కమిషన్ చర్యలు తీసుకోవాలి.. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (Automatic Number Plate Recognition – ANPR) వ్యవస్థ ఎన్సీఆర్ అందుబాటులోకి వచ్చాక తదుపరి చర్యలు తీసుకుందాం..” అని సీఏక్యూఎంకు రాసిన లేఖలో ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా రాసుకొచ్చారు.
Delhi : కాలుష్య నియంత్రణలో భాగంగా..
భారత్ విశ్వనగరం ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టిన స్థానిక సర్కారు.. కాలం చెల్లిన వాహనాలకు బంకుల్లో ఇంధనం పోయొద్దని ఇటీవలే నిర్ణయించింది. 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ బండ్లకు ఇంధనం నిలిపివేయాలనే నిర్ణయం జులై 1న అమల్లోకి వచ్చింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం, ఆచరణ సాధ్యం కాకపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది.