అక్షరటుడే, హైదరాబాద్: తెలంగాణలోని విద్యా సంస్థలకు యూజీసీ మంజూరు చేసే డీమ్డ్ వర్సిటీ హోదాను తుది తీర్పునకు లోబడి ఇవ్వాలని, ఇకపై డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పిస్తూ జారీ చేసే ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేయాలని యూజీసీ UGC ని హైకోర్టు High Court ఆదేశించింది.
ముందస్తు ఆమోదం తీసుకోకుండా ప్రైవేటు విద్యా సంస్థలకు యూజీసీ డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ సర్కారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
సర్కారు తరఫున అడ్వకేట్ జనరల్ Advocate General వాదనలు వినిపించారు. ప్రైవేటు విద్యా సంస్థలకు డీమ్డ్ వర్సిటీ హోదా deemed university status ను కల్పించే ముందు యూజీసీ రాష్ట్ర సర్కారు ఆమోదం తీసుకోవాల్సి ఉందని గుర్తుచేశారు. అందులో ఉన్న సౌకర్యాలపై నివేదిక పొందిన తర్వాతే ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉండగా.. ఇందుకు విరుద్ధంగా యూజీసీ అనుమతులు మంజూరు చేస్తోందన్నారు.
యూజీసీ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పాత్రను పరిమితం చేస్తోందని పేర్కొన్నారు. డీమ్డ్ వర్సిటీల వల్ల ఏదైనా ఇష్యూ ఏర్పడితే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. దీనికితోడు ఆఫ్ క్యాంపస్ పేరుతో పలుప్రాంతాల్లో వీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు.
విశ్వవిద్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం డీమ్డ్ సర్టిఫికెట్ ను ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉందని, కానీ 60 రోజుల్లో ధ్రువీకరించకపోతే ఆమోదం పొందినట్లుగానే భావించాల్సి ఉంటుందన్నారు.
మెరుగైన రేటింగ్ ల కోసం న్యాక్ అధికారులతో కుమ్మక్కె సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్న డీమ్డ్ వర్సిటీలున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో యూజీసీ నిబంధనల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును కోరారు.
మరోవైపు ప్రైవేటు వర్సిటీల తరఫు సీనియర్ అడ్వకేట్లు వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారమే యూజీసీ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. అందువల్ల ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. విద్యా సంస్థలకు మంజూరు చేసిన డీమ్డ్ వర్సిటీ హోదా తుది తీర్పునకు లోబడి స్పష్టం చేసింది. ప్రతివాదులైన యూజీసీ, అరోరా, మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్, చైతన్య, కేఎల్, సింబయాసిస్, విజ్ఞాన్ (Arora, Mallareddy Vishwa Vidyapeeth, Chaitanya, KL, Symbiosis, Vignan) కు నోటీసులు జారీ చేస్తూ జూన్ 30లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తుది విచారణను జులై 30కి హైకోర్టు వాయిదా వేసింది.