అక్షరటుడే, న్యూఢిల్లీ: Trade Deal : భారత్ పూర్తిగా వ్యవసాయ ఆధారిత దేశం. కోట్లాది కుటుంబాలు వ్యవసాయ, అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే, దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న సాగు రంగాన్ని ప్రమాదంలోకి నెట్టే ఓ ఒప్పందాన్ని చేసుకోవాలని అమెరికా పట్టుబడుతోంది. అందుకు ఇండియా నిరాకరిస్తోంది.
ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చల్లో జన్యుపరంగా మార్పిడి చేయబడిన (జీఎం) ఉత్పత్తులు GM products ప్రధానంగా అడ్డంకిగా మారాయి. లక్షలాది మంది భారతీయ రైతులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, కచ్చితంగా జీఎం ఉత్పత్తులను ఇండియాలోకి అనుమతించాలని అమెరికా పట్టుబడుతోంది.
Trade Deal : అంగీకరించని భారత్.. పట్టువీడని యూఎస్
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే భారత్ సహా ప్రపంచ దేశాలపై సుంకాల మోత మోగించారు. వీటిని తాత్కాలికంగా పక్కన పెట్టిన ఆయన.. తమతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని గడువు విధించారు. మరో వారం రోజుల్లో ఆ గడువు ముగియనుండగా, ఇండియా-యూఎస్ మధ్య వాణిజ్య చర్చలు జోరుగా సాగుతున్నాయి.
అయితే, జన్యు మార్పిడి పంటల విషయంలోనే రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. వ్యవసాయం, పాడి పరిశ్రమ సహా ఇతర సున్నితమైన అంశాల్లో అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గడం లేదు. వాణిజ్య ఒప్పందాల గురించి చర్చలు జరపడంలో భారతదేశం ఎల్లప్పుడూ వ్యవసాయం, పాడి పరిశ్రమపై రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా విధానాన్ని అనుసరిస్తుంది. అందులో భాగంగానే అమెరికా కోరుతున్నట్లుగా జన్యుమార్పిడి ఉత్పత్తులపై రాయితీలు ఇవ్వకూడదని భావిస్తోంది.
Trade Deal : రైతులకు విపత్తే..
అమెరికా నుంచి ఇండియాలోకి జన్యు మార్పిడి ఉత్పత్తులు వస్తే లక్షలాది రైతులకు విపత్తుగా మారనుందని వ్యవసాయ ఆర్థికవేత్త దీపక్ పరీక్ (Agricultural economist Deepak Pareek) హెచ్చరించారు. సోయా, మొక్కజొన్న పండించే సుమారు 24 మిలియన్ల రైతుల ప్రయోజనాలకు తీవ్ర భంగం వాటిల్లుతుందన్నారు. వ్యాధులను తట్టుకునేలా, పోషక విలువలు పెంచడానికి జన్యుపరంగా మార్పు (జీఎం)genetically modified (GM) చేసిన ఉత్పత్తులను మనకు ఎగుమతి చేయాలని అమెరికా యత్నిస్తోంది.
2020లో సోయాబీన్ (soybeans)లో 94 శాతం, యూఎస్USలో పండించే మొక్కజొన్న (CORN)లో 92 శాతం జన్యుపరంగా మార్పు చేయబడ్డాయి. వీటిని దిగుమతి చేసుకోవాలని అమెరికా కోరుతోంది. ఒకవేళ చౌకగా వస్తుందని అగ్రరాజ్యం నుంచి సోయా, మొక్కజొన్న దిగుమతులను అనుమతిస్తే దేశీయంగా మరింత ధరలు తగ్గవచ్చని, ఇది రైతుల జీవనోపాధిని దెబ్బ తీస్తుందని ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మాజీ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ తెలిపారు.
“అమెరికన్ వేరియంట్‌పై ఇండియా సుంకాన్ని తగ్గిస్తే దాదాపు 11 మిలియన్ల మంది భారతీయ సోయాబీన్ రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికే పేదరికంలో ఉన్న రైతులను మరింత పేదరికంలోకి నెట్టివేస్తుంది” అని హుస్సేన్ వివరించారు. అమెరికాలో హెక్టార్ కు 4.2 టన్నుల సోయా దిగుబడి వస్తుండగా, మన దేశంలో ఒక టన్నుకు మించి ఎప్పుడూ రాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో సోయా దిగుమతులను అనుమతించడం ద్వారా మన రైతులు చనిపోయే ప్రమాదముందని, ఈ క్రమంలో ఇండియా అందుకు అంగీకరించక పోవచ్చని అభిప్రాయపడ్డారు.
దానికి బదులుగా మన రైతులు కూడా జన్యుమార్పిడి పంటలను పండించడానికి అనుమతించాలని పరీక్ సూచించారు. అమెరికన్ జన్యుమార్పిడి మొక్కజొన్న లేదా మొక్కజొన్నకు అనుమతిస్తే కూడా ఇలాంటి సమస్యలే ఉత్పన్నమవుతాయని వివరించారు.