అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Revanth Reddy | కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ఏడాదిలో కనీసం నెల రోజుల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిరుపేదలకు సేవలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కోరారు. ఒక సామాజిక బాధ్యతగా సామాన్య ప్రజలకు సేవలు అందించడంతో వైద్య వృత్తిలో గొప్ప అనుభూతి, ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఏఐజీ (AIG) ప్రారంభించిన నూతన ఆస్పత్రిని బుధవారం ఆయన ప్రారంభించారు. కార్పొరేట్ రంగంలో ఉన్న వైద్యులు ప్రభుత్వ సేవలు అందించాలంటే అనుసంధానం చేయడానికి వీలుగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించామన్నారు.
అమెరికాలో స్థిరపడిన మన రాష్ట్రానికి చెందిన డాక్టర్లు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు సేవలు అందించాలంటే తగిన ప్లాట్‌ఫామ్ లేదన్నారు. వారిక్కడ ఉన్న సమయంలో సేవలు అందించాలనుకుంటే అందుకు అనుగుణంగా ఒక వేదిక ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
CM Revanth Reddy | ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు
ప్రభుత్వ ఆస్పత్రి(Government Hospital)కి వెళితే ప్రాణాలు పోతాయన్న అభిప్రాయం నుంచి దూరం చేయడానికి తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం తెలిపారు. కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. వందేళ్ల ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)కి 30 ఎకరాల స్థలం కేటాయించి.. రూ.3 వేల కోట్లతో కొత్త భవనం నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నిమ్స్‌లో మరో 2 వేల పడకల విభాగం ప్రారంభిస్తామని చెప్పారు.
CM Revanth Reddy | రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు
ప్రస్తుత రోజుల్లో పెరిగిన వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని తాము అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ (Rajiv Arogyasri) పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద ఇప్పటివరకు రూ.14 వందల కోట్లు ఖర్చు చేశామని ఆయన వివరించారు. పేదలకు మెరుగైన విద్య, వైద్యం అందించానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా బడ్జెట్‌లో విద్యా రంగానికి రూ.21 వేల కోట్లు, వైద్య రంగానికి రూ.11,500 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.
CM Revanth Reddy | మహిళకు హెల్త్ ప్రొఫైల్ కార్డులు
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులకు హెల్త్ ప్రొఫైల్(Health Profile) తయారు చేయాలన్నది తమ లక్ష్యమని సీఎం అన్నారు. వారందరికీ వారివారి హెల్త్ ప్రొఫైల్స్‌తో ఒక యూనిక్ ఐడీ నంబర్‌తో కార్డులను జారీ చేస్తామని చెప్పారు. మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని, నివారణ చర్యల్లో భాగంగా హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేయాలన్న ఆలోచన చేశామన్నారు. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఇటీవలే ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు(Dr. Nori Dattatreya)ను రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా నియమించామన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు రెండో అతిపెద్ద ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చినందుకు డాక్టర్ నాగేశ్వరరెడ్డిని సీఎం అభినందించారు.
CM Revanth Reddy | జపాన్‌లో నర్సులకు డిమాండ్
ప్రస్తుతం నర్సింగ్ ప్రొఫెషన్‌కు జపాన్(Japan) దేశంలో మంచి డిమాండ్ ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీంతో ఇక్కడ నర్సింగ్ విద్యార్థులకు జపాన్ భాష (జపనీస్)ను ఆప్షనల్‌గా నేర్పించాలని నిర్ణయించామన్నారు. భారత్ వెనుకబడిన దేశం అన్న అభిప్రాయం నుంచి బయకు తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అనేక విషయాల్లో ఎన్నో విజయాలు సాధించిన చరిత్ర మనకున్నది అని సీఎం అన్నారు.