అక్షరటుడే, వెబ్‌డెస్క్: Police Constable : సామాన్యులు చిన్న తప్పు చేస్తే.. అధికారులు ఊరుకోరు.. అలాంటిది వారే తప్పు చేస్తే.. ఒక ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ఎంత పెద్ద టాస్క్ అనేది తెలియంది కాదు. ఆ తర్వాత ఉద్యోగి వేతనం పొందాలంటే నిత్యం విధులు నిర్వర్తించాల్సిందే. కానీ, ఓ కానిస్టేబుల్ విధులు నిర్వర్తించకుండానే 12 ఏళ్లపాటు వేతనం పొందాడు. ఆ ఉద్యోగి విధుల్లో ఉన్నాడా.. లేడా.. చూసుకోకుండానే అధికారులు కూడా వేతనం ఇస్తూనే వచ్చారు. చివరికి బదిలీల సమయంలో అసలు విషయం వెలుగుచూసింది.
12 ఏళ్ల పాటు ఓ కానిస్టేబుల్ ఉద్యోగం చేయకుండానే వేతనం రూపంలో రూ.28 లక్షలు తీసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. విదిష జిల్లా(Vidisha district)కు చెందిన సాగర్ 2011లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అతడికి భోపాల్ పోలీస్ లైన్(Bhopal Police Lines)లో పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ తర్వాత సాగర్ శిక్షణకు వెళ్లాల్సి వచ్చింది. కానీ, అతడు శిక్షణకు వెళ్లకుండా నేరుగా తన ఇంటికి వెళ్లిపోయాడు.
Police Constable : ఎవరూ పట్టించుకోకపోవడంతో..
అయితే తాను ఇంటికి వెళ్తున్నట్లు సాగర్ ఏ అధికారికి కూడా సమాచారం అందించలేదు. సెలవు కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. తన సర్వీసు ఫైల్‌ను మాత్రం భోపాల్ పోలీస్ స్టేషన్‌కు పోస్టులో పంపించాడు. ఇక్కడే అసలు నిర్లక్ష్యం జరిగింది. ఫైల్ చేతికి అందాక, ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే ఆమోదముద్ర వేసి వేతనం ప్రాసెస్ పూర్తి చేశారు. ఇక, అతడు విధుల్లో ఉన్నాడా.. లేడా.. అనే విషయం ఎవరూ పట్టించుకోలేదు. ఏ అధికారి వెరిఫై చేయలేదు. దీంతో సాగర్ గత 12 ఏళ్లలో రూ.28 లక్షల వరకు వేతన రూపంలో ప్రభుత్వ సొమ్మును అందుకున్నాడు. గత 12 ఏళ్లలో ఏ అధికారి కూడా ఈ అక్రమాన్ని గుర్తించకపోవడం విడ్డూరం.
కాగా, ఠాణాలో చాలా కాలంగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేయాలని ఉత్తర్వలు రావడంతో.. స్టేషన్‌లోని సిబ్బంది వివరాలను డిజిటలైజ్ చేయాలని డీజీపీ ఆదేశించారు. అలా డిజిటలైజ్ చేస్తున్న క్రమంలో మనోడి విషయం వెలుగుచూసింది.
Police Constable : విచారణలో ఏమన్నాడంటే..
వెంటనే అతడిని అధికారులు పిలిపించి విచారణ చేపట్టారు. అయితే, తను మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పాడు. దీంతో దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, టీట నగర్ ఏసీపీ (Tita Nagar ACP) అంకిత ఖతార్కర్‌కు దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు.
ఇక కేసు దర్యాప్తులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. సాగర్ ఒంటరిగా శిక్షణకు వెళ్లడానికి అనుమతి తీసుకున్నాడని.. కానీ అతను ట్రైనింగ్‌కు రాలేదని ఆమె తెలిపింది. ట్రైనింగ్ సెంటర్‌లో అతని హాజరు కూడా నమోదు కాలేదని తెలిపింది. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్ నుంచి రూ. 1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన డబ్బును అతని రాబోయే జీతం నుంచి తీసుకుంటామని ఏసీపీ చెప్పుకొచ్చింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇందులో నిర్లక్ష్యంగా వ్వవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపింది.