అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించాలని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సూచించారు.
కొందరు దుబాయ్‌లో ఆఫీసులు పెట్టి, ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో (LB Stadium) నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని కోరారు. సోషల్ మీడియాలో యుద్ధం (social media war) ప్రకటించాలని.. ఆ యుద్ధంలో కల్వకుంట్ల గడీ ముక్కలుముక్కలు కావాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.
CM Revanth Reddy | 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం
తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు (government jobs) ఇచ్చామని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి, కేసీఆర్.. దమ్ముంటే ఉద్యోగ నియామకాలపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. 60 వేల ఉద్యోగాలకు ఒక్కటి తగ్గినా.. తాను క్షమాపణ చెబుతానన్నారు.
CM Revanth Reddy | రైతురాజ్యంపై చర్చ పెడదాం
రైతురాజ్యంపై పార్లమెంట్ లేదా అసెంబ్లీలో చర్చపెడదామని ప్రధాని మోదీ (Prime Minister Modi), మాజీ సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు. ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమన్నారు. రైతు భరోసా విఫలమవుతుందని.. కొందరు గోతికాడ నక్కల్లా ఎదురు చూశారని ఆరోపించారు. తొమ్మిది రోజుల్లో రైతు భరోసా నిధులు జమ చేశామని వివరించారు.
CM Revanth Reddy | ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి 119 ఎమ్మెల్యే సీట్లు 153కు పెరుగుతాయని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో (Women Reservation Bill) 60 మంది మహిళలు ఎమ్మెల్యేలు అవుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.