అక్షరటుడే, వెబ్‌డెస్క్: Warangal Congress | వరంగల్ కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) దంపతులకు, మిగతా ఎమ్మెల్యేలకు పడడం లేదు. ఇటీవల కొండా మురళి (Konda Murali), కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పలువురు నేతలు ఆగ్రహంతో ఉన్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే కొండా మురళి పీసీసీ (PCC) క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. అనంతరం ఆయన మంత్రి పొంగులేటిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత కొండా సురేఖ, కొండా మురళి దంపతులు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)తో కూడా సమావేశం అయ్యారు. అయితే కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలని మిగతా ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.
Warangal Congress | తాడో పేడో తేల్చాలి
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari), పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిపై ఇటీవల కొండా దంపతులు వ్యాఖ్యలు చేశారు. వారి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. అంతేగాకుండా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారంలోపు తాడోపేడో తేల్చాలని వరంగల్ నేతలు డెడ్‌లైన్ పెట్టారు. అయితే సోమవారం పీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండా వ్యతిరేక వర్గంతో సమావేశం కానుంది. వారితో సమావేశం అనంతరం కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటదనే ఉత్కంఠ నెలకొంది. రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కమిటీ ఫోకస్ చేయనుంది. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Warangal Congress | చిచ్చురేపిన కొండా సుష్మిత ట్వీట్
ఇప్పటికే రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో కొండా దంపతుల కుమార్తె సుష్మిత పటేల్ (Susmitha Patel) ట్వీట్ చిచ్చు రేపింది. తాను భవిష్యత్‌లో పరకాల (Parakal) నుంచి పోటీ చేస్తాననేలా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల కొండా మురళి కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందిస్తూ కొండా సురేఖ తమ కూతురిలో రాజకీయ రక్తం ప్రవహిస్తోందన్నారు. ఆమె పరకాల నుంచి పోటీ చేయాలనుకుంటే ఆమె నిర్ణయాన్ని అడ్డుకునే అధికారం తమకు లేదన్నారు. అక్కడ ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఉన్నారు. ఇటీవల కొండా మురళి రేవూరి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఆయన తమ కాళ్లు పట్టుకోవడంతో.. గెలిపించామన్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరంగల్ కాంగ్రెస్‌లో పోరు పార్టీ నష్టం చేసే అవకాశం ఉందని కార్యకర్తలు, నాయకులు భావిస్తున్నారు.