అక్షరటుడే, వెబ్‌డెస్క్: BC Reservations | రాష్ట్ర జనాభాలో సింహభాగం ఉన్న బీసీల చుట్టే రాజకీయం తిరుగుతోంది. వెనుకబడిన వర్గాల మెప్పు పొందే ప్రయత్నం జరుగుతోంది. కాంగ్రెస్ వెనుకబడిన వర్గాలపై దృష్టి సారించిన అధికార కాంగ్రెస్ పార్టీ(Congress Party) బీసీ నినాదాన్ని బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే కుల గణన నిర్వహించి, సామాజిక వర్గాల వారీగా లెక్కలు తేల్చింది.
తాజాగా బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించడానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు (Assembly Special Sessions) నిర్వహించాలని నిర్ణయించింది. బీసీ వర్గాలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ కార్యాచరణ కొనసాగిస్తుండగా, మిగతా ప్రధాన పార్టీలు కూడా ఇదే అంశాన్ని తలకెత్తుకుంటున్నాయి. అయితే, ఇప్పటిదాకా జరిగిన పరిణామాలను బట్టి బీసీ ఓట్ల వేటలో మిగతా రాజకీయ పక్షాల కంటే కాంగ్రెస్ ముందు ఉందన్నది మాత్రం వాస్తవం.
BC Reservations | కాంగ్రెస్ కమిట్‌మెంట్..
కొంతకాలంగా బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో పని చేస్తోంది. వెనుకబడిన వర్గాల లెక్కలు తేల్చడంతో పాటు రిజర్వేషన్ల అంశానికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రేవంత్ ప్రభుత్వం.. అధికారంలోకి రాగానే కుల గణనను చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కులాల వారీగా జనాభా వివరాలు సేకరించి, బీసీల లెక్కలు తేల్చింది. ఇక, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని కూడా కాంగ్రెస్ నిలబెట్టుకుంది. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించింది.
జీవో ద్వారా రిజర్వేషన్లు కల్పించే అవకాశముందన్న న్యాయ నిపుణుల సలహా మేరకు ఆ దిశగా అడుగులు వేసింది. ఈ మేరకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని తాజా కేబినెట్ భేటీ (Cabinet Meeting)లో నిర్ణయించింది. అదే సమయంలో గత బీఆర్ ఎస్ ప్రభుత్వం (BRS Government) తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మొత్తంగా బీసీల విషయంలో పూర్తిగా కమిట్‌మెంట్‌తో ఉన్న కాంగ్రెస్.. చాలా ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తోంది. తద్వారా ఆయా వర్గాలను మచ్చిక చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయోజనం పొందడంపై దృష్టి సారించింది.
BC Reservations | వెనుకబడిన బీజేపీ, కాంగ్రెస్
అత్యధిక జనాభా ఉన్న బీసీల విషయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ (BJP) వైఖరి కాస్త గందరగోళంగా ఉన్నాయి. పైపైన బీసీల పాట పాడుతున్నప్పటికీ, ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో రెండు పార్టీలూ విఫలమయ్యాయి. బీఆర్ఎస్ మొదటి నుంచి బీసీల విషయంలో వెనుకబడి ఉంది. మెజార్టీ ఓటర్ల విషయంలో సానుకూలంగా వ్యవహరించాల్సిన గులాబీ పార్టీ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. బీసీ రేసులో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంటే, ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ బీసీ నినాదం తలకెత్తుకున్నా జనం పెద్దగా నమ్మక పోవచ్చన్న అభిప్రాయం నెలకొంది. ఎందుకుంటే గతంలో కేసీఆర్ ఎస్సీల విషయంలో వ్యవహరించిన తీరే అందుకు కారణం.
ప్రత్యేక తెలంగాణ పోరాట సమయంలో దళితుడ్ని తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని చేస్తామని కేసీఆర్ (KCR) అనేకసార్లు ప్రకటించారు. తీరా రాష్ట్రం సిద్ధించాక ఆయనే గద్దెనెక్కారు. అలాంటి వ్యక్తి.. ఇప్పుడు బీసీలకు ఎలా న్యాయం చేస్తారన్న ప్రశ్న వెనుకబడిన సామాజికవర్గాల నుంచి ఎదురవుతోంది. అడపా దడపా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) బీసీ నినాదం, సామాజిక న్యాయం పేరిట పోరాటాలు చేస్తున్నా.. అదెంత వరకు ప్రయోజనం చేస్తుందో కాలమే సమాధానం చెబుతుంది.
BC Reservations | భిన్నంగా బీజేపీ వైఖరి
బీసీల విషయంలో బీజేపీ వైఖరి విభిన్నంగా ఉంది. బీసీలకు సామాజిక న్యాయం చేస్తామని కాషాయ పార్టీ చెబుతున్నప్పటికీ, ఆచరణలో మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టడం లేదు. బీసీని ప్రధానమంత్రిని చేశామని, దేశవ్యాప్త కుల గణన చేపట్టి బీసీ లెక్కలు తేల్చుతామని చెబుతున్నప్పటికీ జనం పెద్దగా నమ్మడం లేదు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బీసీ నాయకుడ్ని అర్ధాంతరంగా తప్పించిన బీజేపీ.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం ఆ వర్గాలను అంతగా ఆకట్టుకోలేదన్నది వాస్తవం. ఎందుకంటే తాజాగా రాష్ట్ర అధ్యక్షుడిని నియమించిన కాషాయ పార్టీ.. అగ్రకుల నాయకుడికి అవకాశం ఇవ్వడమే అందుకు కారణం.