అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | తమకు ఏదైనా సమస్య వస్తే ప్రజలు గతంలో పోలీస్‌స్టేషన్ (Police stations) మెట్లు ఎక్కాలంటే భయపడేవారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమల్లో ఉన్నప్పటికీ కొందరి పనితీరు కారణంగా బాధితులు స్టేషన్లకు తమ సమస్యను చెప్పుకునేందుకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన సీపీ సాయి చైతన్య ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఒకవైపు పోలీస్స్టేషన్లను ప్రక్షాళన చేస్తూనే.. మరోవైపు ప్రతి సోమవారం పోలీస్ ప్రజావాణి నిర్వహిస్తున్నారు. పోలీస్స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోయినా.. పీఎస్‌లలో ఎలాంటి ఇబ్బందులన్నా తనను కలవచ్చని సూచనలు చేశారు. దీంతో బాధితులు నేరుగా సీపీని కలిసి తమ బాధలను చెప్పుకుంటున్నారు.
CP Sai Chaitanya | అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు..
సీపీ కార్యాలయానికి ప్రతి సోమవారం బాధితులు తరలివస్తున్నారు. కాగా.. రెండో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముండే సవిత అనే మహిళ సీపీ ఆఫీస్‌కు వచ్చింది. ఇదే సమయంలో కార్యాలయంలోకి వెళ్తున్న సీపీ సాయిచైతన్య తన కారును ఆపి మహిళతో మాట్లాడారు. తన భర్త అదనపు కట్నం కోసం నిత్యం తనను వేధిస్తున్నాడని ఆమె వాపోయింది. ఆమె దరఖాస్తును పరిశీలించిన సీపీ తక్షణమే సమస్యను పరిష్కరించాలని మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వోను ఆదేశించారు.