అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pod Taxis | హైదరాబాద్ (Hyderabad) నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. నగరంలో జనాభా పెరగడంతో ట్రాఫిక్ కూడా పెరిగి ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇప్పటికే ట్రాఫిక్ కష్టాల చెక్కు మెట్రో రైలు(Metro Train)ను ప్రవేశ పెట్టినా.. ఇంకా రద్దీ అధికంగానే ఉంది. ఒక్క వర్షం పడితే నగరవాసులు గంటల పాటు ట్రాఫిక్‌లో ఉండిపోతున్నారు. ఈ క్రమంలో మహా నగరంలో కొత్తగా పాడ్ ట్యాక్సీలు (Pod Taxis) ప్రవేశ పెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని భావిస్తారు.
Pod Taxis | ఏమిటిఈ పాడ్ ట్యాక్సీలు
పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ (Personal Rapid Transit) అనేది పట్టణ ప్రాంతాలలో ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేర్చడానికి ఉపయోగించే రవాణా వ్యవస్థ. డ్రైవర్ లేకుండానే ఇవి నడుస్తాయి. చిన్న బాక్సుల మాదిరిగా ఉండే వీటిని పాడ్ ట్యాక్సీలు అని కూడా అంటారు. ప్రత్యేకంగా నిర్మించిన మార్గాల్లో మాత్రమే ఇవి ప్రయాణించగలవు. ట్రాఫిక్ రద్దీని (Traffic Congestion) నియంత్రించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక్కో పాడ్ ట్యాక్సీలో నలుగురి నుంచి ఆరుగురు వరకు ప్రయాణం చేయవచ్చు.
Pod Taxis | పలు మార్గాలపై దృష్టి
ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (Hyderabad Metropolitan Development Authority) పరిధిలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (UMTA) పాడ్ ట్యాక్సీలపై దృష్టి పెట్టింది. పెరుగుతున్న వాహనాలతో నగరంలో ప్రజలు ట్రాఫిక్ సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో పాడ్ ట్యాక్సీలు ప్రవేశపెట్టాలని యూఎంటీఏ యోచిస్తోంది. పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ హైదరాబాద్‌కు అనుకూలంగా ఉంటుందని అధికారులు తేల్చారు. ప్రధానంగా ఐటీ కారిడార్, వాణిజ్య కేంద్రాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో మొదట ఈ విధానాన్ని ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నారు.
Pod Taxis | కాలుష్యరహితంగా..
ప్రస్తుతం పాడ్ ట్యాక్సీలు దుబాయి, లండన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జెవార్ ఫిల్మ్ సిటీ వరకు వీటిని అందుబాటులోకి తీసుకున్నారు. ఈ మేరకు డీపీఆర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్(Hyderabad)లో వాహనాలు పెరగడంతో కాలుష్యం పెరుగుతోంది. దీంతో త్వరలో డీజిల్ వాహనాలను హైదరాబాద్‌లోకి అనుమతించబోమని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి రాయితీలు ఇస్తామన్నారు. ఈ క్రమంలో విద్యుత్‌తో నడిచే పాడ్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్‌తో పాటు కాలుష్యం కూడా తగ్గనుంది.