అక్షరటుడే, వెబ్‌డెస్క్: Government Teachers | రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల (Government Schools) బలోపేతానికి ఎన్నో చర్యలు చేపడుతోంది. ఏటా రూ. వేల కోట్ల నిధులు విద్యా రంగానికి కేటాయిస్తోంది. అయినా సర్కారు బడులకు తమ పిల్లలను పంపడానికి చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. అంతేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులే (Government Teachers) తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతుంటారు. ఈ క్రమంలో సర్కారు పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా.. పలువురు టీచర్లు సకాలంలో బడులకు వెళ్లడం లేదు. మరికొంత పాఠశాలకు హాజరు కాకున్నా.. తర్వాత రోజు రిజిస్టర్లో సంతకం పెట్టి వచ్చినట్లు చూపెడుతున్నారు. దీంతో ప్రభుత్వం టీచర్లందరికీ ఫేషియల్ అటెండెన్స్ అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో డుమ్మా మాస్టర్లకు చెక్ పడనుంది. ఈ ఏడాది నుంచే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (Facial Recognition System) అమలు చేయడానికి అనుమతుల కోసం విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
Government Teachers | బడికి వెళ్లకున్నా హాజరు
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో రిజిస్టర్ విధానంలో ఉపాధ్యాయుల హాజరు నమోదు చేస్తున్నారు. అయితే పలువురు టీచర్లు బడికి రాకున్నా తర్వాత రోజు సంతకాలు పెడుతున్నారు. కొంత మంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు అయితే రోజుల తరబడి పాఠశాల ముఖం చూడడం లేదు. మారుమూల ప్రాంతాలు, తండాల్లో పనిచేసే కొందరు ఉపాధ్యాయులు అసలు పాఠశాలలకు వెళ్లడం లేదు. స్థానికంగా ఉండే వారికి ఎంతో కొంత ఇచ్చి వారితో పాఠాలు చెప్పిస్తున్నారు. వారు మంచి బిజినెస్లు చూసుకుంటున్నారు. ప్రభుత్వం ఫేషియల్ అటెండెన్స్ తీసుకు వస్తే అలాంటి వారికి చెక్ పడనుంది.
Government Teachers | నమ్మకం పెరిగేలా..
కొందరు టీచర్లు చేసే పనులతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం పోతుంది. దీంతో ప్రభుత్వం ప్రజల్లో సర్కార్ బడులపై విశ్వాసం పెంపొందించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టీచర్లకు పేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ తీసుకు రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 24వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. లక్షకు పైగా టీచర్లు పని చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు డీఎస్ఈ–ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా ఫేషియల్ అటెండెన్స్ తీసుకుంటున్నారు. గతేడాది ప్రయోగాత్మకంగా పెద్దపల్లి జిల్లా(Peddapalli District)లో ఉపాధ్యాయులకు కూడా ఇదే యాప్ ద్వారా ఫేషియల్ అటెండెన్స్ నమోదు చేశారు. ఇది విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.