అక్షరటుడే, డిచ్‌పల్లి : Dichpalli | ఆ యువకుడు బతుకుదెరువు కొన్నేళ్లుగా దుబాయిలో ఉంటున్నాడు. అక్కడ పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. ఇంటికొచ్చి పెళ్లి చేసుకొని స్థిర పడాలనుకున్నాడు. ఈ క్రమంలో వారం క్రితం దుబాయి నుంచి స్వగ్రామానికి వచ్చాడు. అంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆ యువకుడిని కబలించింది. ఈ విషాద ఘటన డిచ్‌పల్లి మండలంలో (Dichpalli mandal) చోటు చేసుకుంది.
డిచ్‌పల్లి మండలం ఘన్పూర్ గ్రామానికి (Ghanpur village) చెందిన ఒడ్డేపల్లి రంజిత్(30) కొంతకాలంగా దుబాయిలో పని చేస్తున్నాడు. అయితే ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో వారం క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బైక్ వెళ్తుండగా ఘన్పూర్ సమీపంలో అదుపు తప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ రంజిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామాంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లి చేసుకుంటాడనుకున్న కుమారుడు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.