అక్షరటుడే, వెబ్డెస్క్:Bullet Train Update | మన దేశంలో చేపట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంటోంది. జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంతో నిర్మిస్తున్న హైస్పీడ్ రైలు ప్రాజెక్టు(High Speed Train Project)లో మరో కీలక ముందడుగు పడింది. ముంబై-అహ్మదాబాద్ మధ్య హై-స్పీడ్ రైలు కారిడార్ లో నెక్ట్స్ జనరేషన్ E10 షింకన్ సేన్ రైళ్లను ప్రవేశపెట్టడానికి జపాన్ ప్రభుత్వం(Japanese Government) అంగీకరించింది. 508 కి.మీ పొడవైన కారిడార్ను జపనీస్ షింకన్ సేన్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మిస్తున్నారు. ప్రస్తుత E5 మోడల్ స్థానంలోకి రానున్న E10 రైళ్లను రెండు దేశాలలో ఒకేసారి ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు బాగా జరుగుతున్నాయని, 15 వంతెనలు పూర్తయ్యాయని, మరో నాలుగు వంతెనల పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని వివరించారు.
Bullet Train Update | అధునాతనమైన E10 షింకన్ సేన్ రైళ్లు..
E10 షింకన్ సేన్(E10 Shinkansen) అనేది E5 సిరీస్ లో భాగంగా అభివృద్ధి చేసిన నెక్ట్స్ జనరేషన్ హై-స్పీడ్ రైలు. E5 ప్రస్తుతం జపాన్ టోహోకు షింకన్ సేన్ లైన్లో నడుస్తోంది. అద్భుతమైన డిజైన్, అధునాతన భద్రతతో గంటకు 320 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. దీని ఆధారంగా మరింత మెరుగైన పనితీరు, మెరుగైన ఏరోడైనమిక్స్(Improved Aerodynamics), మెరుగైన శక్తి సామర్థ్యం, మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా E10 షింకన్ సేన్ రైళ్లను అభివృద్ధి చేస్తున్నారు. అతి తక్కువ శబ్ధంతో కుదుపులు లేని స్థిరమైన ప్రయాణ అనుభూతిని ఇది కలిగిస్తుందని చెబుతున్నారు. ఇప్పటివరకు అభివృద్ధి చేయబడిన అత్యంత అధునాతన హై-స్పీడ్ రైళ్లలో ఇది ఒకటిగా మారుతుంది. పర్యావరణ హితంగా, రైలు ప్రయాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
Bullet Train Update | రెండు దేశాల్లో ఒకేసారి..
E10 షింకన్ సేన్ను అభివృద్ధి చేస్తున్న జపాన్.. ఆ దేశంతో పాటు ఇండియాలోనూ ఒకేసారి ప్రవేశపెట్టనున్నారు. షింకన్ సేన్ టెక్నాలజీ(Shinkansen Technology)ని ఉపయోగించి జపాన్ సహాయంతో నిర్మిస్తున్న 508 కిలోమీటర్ల ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్లో దీన్ని ప్రారంభించనున్నారు. జపాన్ వెలుపల ఇటువంటి అధునాతన హై-స్పీడ్ రైలు సాంకేతికతను మోహరించడం ఇదే మొదటిసారి. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.
Bullet Train Update | పూర్తయిన సముద్రగర్భ సొరంగం
కుర్లా కాంప్లెక్స్, థానేలను కలిపే 21 కి.మీ పొడవైన సముద్రగర్భ సొరంగం పనులు దాదాపు పూర్తయ్యాయి. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో మహారాష్ట్రలోని ఘన్సోలి, షిల్ఫాటా మధ్య సొరంగం పనులు ముఖ్యమైన మైలురాయిని సూచిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ(Railways Ministry) పేర్కొంది. ఇప్పటివరకు 310 కి.మీ వయాడక్ట్ నిర్మాణం కూడా పూర్తయింది. ట్రాక్ వేయడం, స్టేషన్ నిర్మాణం, వంతెన పనులు, ఓవర్ హెడ్ విద్యుత్ వైర్ల ఏర్పాటు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొంది. బీకేసీలో నిర్మించనున్న స్టేషన్ ఇంజనీరింగ్ అద్భుతం అని రైల్వే శాఖ అభివర్ణించింది.