అక్షర టుడే, నిజాంసాగర్: Nizamsagar | మండలంలోని వడ్డేపల్లి పోస్ట్ ఆఫీస్‌లో విధులు నిర్వహించే బీపీఎం అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖాతాదారుల సొమ్ము చేస్తున్నా.. ఖాతాల్లో మాత్రం జమ కావడం లేదు. దీంతో విషయం తెలుసుకున్న ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే..
గ్రామానికి చెందిన పలువురు గ్రామంలోని పోస్ట్ ఆఫీస్‌లో (Post Office) ప్రతినెలా వివిధ ఖాతాల కింద సొమ్ము జమ చేస్తుంటారు. అయితే, బీపీఎం కొద్దికాలంగా రూ.200 –500 జమ చేసే ఖాతాదారుల నుంచి డబ్బులు తీసుకుని మాన్యువల్ పాసు పుస్తకాల్లో జమచేస్తున్నారు. కాగా, ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని బాధితులు వాపోతున్నారు. సదరు బీపీఎం (BPM) మూడు నెలలపాటు సెలవులో వెళ్లడంతో, అచ్చంపేటకు చెందిన బీపీఎం ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించారు. ఎప్పటిలాగే ఖాతాదారులు డబ్బులు జమ చేసేందుకు రాగా, ప్రస్తుత బీపీఎం పరిశీలించడంతో గత బీపీఎం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు స్పందించి, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. బీపీఎం అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Nizamsagar | ఆన్‌లైన్‌లో డబ్బులు లేవు..

– ఆవుసుల మనవ్వ, వడ్డేపల్లి
నేను ప్రతి నెలా రూ.200 ఆర్‌డీ ఖాతాలో జమ చేస్తున్నాను. ఈనెల కూడా డబ్బు జమ చేసేందుకు వెళ్లడంతో 9 నెలల నుంచి డబ్బులు జమ కాలేదని బీపీఎం చెప్పారు. దీంతో గత బీపీఎం డబ్బులు జమ చేయలేదని చెప్పారు. మా డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలి.
Nizamsagar | మూడునెలల డబ్బులు జమ చేయలేదు..

– గంగాగౌడ్, వడ్డేపల్లి
ప్రతి నెలా రూ.500 పోస్ట్ ఆఫీస్‌లో జమ చేస్తాను. ఈరోజు కూడా డబ్బు జమ చేసేందుకు రావడంతో 3 నెలల నుంచి జమ కాలేదు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి.
Nizamsagar | ఉన్నతాధికారికి సమాచారం ఇస్తాను..
– ఉపేందర్, ఎస్‌పీఎం, నిజాంసాగర్ పోస్ట్ ఆఫీస్
వడ్డేపల్లిలో ఖాతాదారుల డబ్బును బీపీఎం సొంతానికి వాడుకున్నట్లు దృష్టికి వచ్చింది. నేను ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టాను. ఈ విషయం ఉన్నతాధికారికి సమాచారం ఇస్తాను.