అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLA Raja Singh | బీజేపీ కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్ లీడర్, హిందూ టైగర్‌గా పేరున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను (MLA Raja Singh Resignation) ఆమోదించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్(Arun Singh) ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హిందుత్వవాదిగా యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆయన గత కొంత కాలంగా పార్టీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో పార్టీ అధ్యక్షుడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పార్టీ అధ్యక్షుడు రహస్య సమావేశాలు నిర్వహించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
MLA Raja Singh | అధ్యక్ష ఎన్నికతో..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకుడు రామచందర్‌రావు (Bjp President Ramachandra Rao) ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేయడానికి వెళ్తే అడ్డుకున్నారని రాజాసింగ్ ఆరోపించారు. ఈ క్రమంలో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా నాశనం చేసే వారికి పదవులు కట్టబెడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన జూన్ 30న కిషన్ రెడ్డికి (Kishan Reddy) తన రాజీనామా సమర్పించారు. తాజాగా జాతీయ అధ్యక్షుడు ఆయన రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
MLA Raja Singh | రాజాసింగ్ అడుగులు ఎటువైపు..
రాజాసింగ్ మొదటి నుంచి హిందుత్వవాది అయినప్పటికీ.. తన రాజకీయ జీవితాన్ని మాత్రం టీడీపీ నుంచి ప్రారంభించారు. టీడీపీ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన ఆయన 2014 ఎన్నికలకు ముందు బీజేపీ చేరారు. అనంతరం వరుసగా మూడుసార్లు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. హైదరాబాద్ సిటీలో (Hyderabad city) ప్రతి శ్రీరామ నవమికి రాజాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించే శోభాయాత్రకు లక్షలాది మంది తరలి వస్తారు. ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది.
ఈ క్రమంలో పార్టీ రాజీనామా ఆమోదించడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్లో చేరనని ఆయన ఇది వరకే ప్రకటించారు. కాగా.. గతలోనూ రాజసింగ్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. తిరిగి ఆయన్ను బీజేపీ మళ్లీ పార్టీలోకి చేరుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో రాజసింగ్ కు బీజేపీ గేట్లు మూసుకుపోయినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.