అక్షరటుడే, వెబ్‌డెస్క్: Raja Singh | బీజేపీలో కీలక నాయకుడిగా పేరుగాంచిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. ఇటీవల పార్టీపై చేసిన తీవ్ర విమర్శలు, ప్రముఖులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు నేపథ్యంలో ఆయనపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రాజాసింగ్(Raja Singh) ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ పత్రం తీసుకున్నప్పటికీ, చివరిదాకా దాఖలు చేయలేదు. అటు తర్వాత జరిగిన మీడియా సమావేశాల్లో పార్టీ తీరుపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించినా, దానిని చట్టపరంగా ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాయడానికి సిద్ధమవుతోంది.
Raja Singh | కెరీర్ ముగిసినట్టేనా?
బీజేపీ హైకమాండ్ (BJP Highcommand) ఇప్పటికే ఈ విషయంపై పూర్తి స్థాయిలో సమాచారం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ ప్రతిష్టను కాపాడేందుకు కఠిన నిర్ణయాలకైనా వెనుకాడకూడదని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాజాసింగ్ చాలా కాలంగా హిందూత్వ వాదానికి ప్రాతినిధ్యం వహిస్తూ బీజేపీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. “రాజాసింగ్‌ను బీజేపీ అప్రతిష్ట పరిచిందా?”, “వారు పార్టీ నుంచి పూర్తిగా తొలగించాలనుకుంటున్నారా?” వంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇంతకుముందు రాజాసింగ్ అనేకసార్లు పార్టీ నియమాలు ఉల్లంఘించినా, హైకమండ్ క్షమాభిక్ష పెట్టింది. కానీ ఈసారి మాత్రం జాతీయ నాయకత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక రాష్ట్ర బీజేపీలో మరో కీలక పరిణామంగా ఎన్.రాంచందర్ రావు (N.Ramchandra Rao) శనివారం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9 గంటలకు గన్ పార్క్‌లోని అమరుల స్థూపం వద్ద నివాళులర్పించి, ఆపై రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరుకుని ఉదయం 10 గంటలకు అధికారికంగా బాధ్యతలు చేపడతారు. అనంతరం చార్మినార్(Charminar)లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు.