అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Reservations | బీసీ రిజర్వేషన్ల అంశం ఎటూ తేలడం లేదు.. 42 శాతం కోటాపై ఉత్కంఠ వీడడం లేదు. అసెంబ్లీలో ఆమోదించిన పంపిన బిల్లుకు అనుమతి రాలేదు. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఆర్డినెన్స్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు, హైకోర్టు(High Court) విధించిన గడువు ముంచుకొస్తోంది. సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల పూర్తి చేయాల్సి ఉంది. కానీ బీసీ కోటాపై ఎటూ తేలకపోవడంతో సర్కారు సందిగ్ధంలో పడింది.
ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీకి వెళ్లి రాహుల్ నేతృత్వంలో బీసీ బిల్లు అంశంపై వివిధ పక్షాలకు వివరించనున్నారు. అలాగే, ప్రధాని మోదీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
BC Reservations | కోటా సాధ్యమేనా?
జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు 42 శాతం వాటా రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక కులగణన నిర్వహించిన రేవంత్ సర్కారు.. బీసీల లెక్క తేల్చింది. అనంతరం బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది.
అయితే, పలు సాంకేతిక అంశాలను ఎత్తిచూపుతూ ఈ బిల్లును వెనక్కి తిప్పి పంపినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు (Suprme Court) మార్గదర్శకాలు బిల్లు ఆమోదానికి అడ్డంకిగా మారినట్లు చెబుతున్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అటు రాష్ట్రపతి కానీ, ఇటు కేంద్రం కానీ బిల్లుకు ఆమోదం తెలిపే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు.
BC Reservations | పెండింగ్‌లో ఆర్డినెన్స్..
సెప్టెంబర్ నెలాఖరు లోపు స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) పూర్తి చేయాలని హైకోర్టు గడువు విధించింది. అయితే, సాంకేతిక అంశాలతో బీసీ బిల్లు పెండింగ్‌లో పడడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిపై ఆయన న్యాయ సలహా కోరారు.
అయితే, రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్‌లో ఉన్న తరుణంలో, గవర్నర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని చెబుతున్నారు. ఇదే అంశాన్ని ఇటీవల బీజేపీ నాయకులు (BJP Leaders) కూడా ప్రస్తావించారు. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న అంశంపై గవర్నర్ నిర్ణయం తీసుకోగలరా? అని వారు ప్రశ్నించారు. దీంతో ఆర్డినెన్స్ ఆమోదంపై (Ordinance Approval) ఇప్పట్లో నిర్ణయం తీసుకోక పోవచ్చన్న భావన వ్యక్తమవుతోంది. మరోవైపు, బిల్లుల ఆమోదానికి ఇటీవల సుప్రీంకోర్టు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించింది. నిర్దేశిత సమయంలో బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని, గడువు దాటితే ఆ బిల్లు ఆమోదం పొందినట్లేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీసీ బిల్లు, ఆర్డినెన్స్‌పై ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
BC Reservations | కేంద్రంపై ఒత్తిడికి ప్రయత్నాలు
బీసీ బిల్లును గట్టెక్కించుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన హస్తినకు వెళ్తున్నారు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతో (Rahul Gandhi) కలిసి ప్రధాని మోదీని కలవాలని యోచిస్తున్నారు. ఈ మేరకు పీఎం అపాయింట్‌మెంట్ అడిగినట్లు చెబుతున్నారు. అయితే, పార్లమెంట్ సమావేశాలకు తోడు విదేశీ పర్యటనలు ఉన్న తరుణంలో మోదీ అపాయింట్‌మెంట్ ఇస్తారా? అన్నది సందేహంగానే మారింది.
మతపరమైన రిజర్వేషన్లకు తమకు వ్యతిరేకమని బీజేపీ స్పష్టంగా చెబుతోంది. బీసీలకు కేటాయించిన 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తే బిల్లుకు మద్దతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు(BJP State President Ramchandra Rao), కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) ఇప్పటికే తేల్చి చెప్పారు. ఈ తరుణంలో బీసీ బిల్లు డోలాయమానంలో పడింది.
BC Reservations | ప్రత్యామ్నయ చర్యలు..
కేంద్ర ప్రభుత్వం నుంచి, గవర్నర్ నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే పరిస్థితి ఏమిటన్నది కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తోంది. రిజర్వేషన్ల(BC Reservations) బిల్లుకు, ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించక పోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. హైకోర్టు విధించిన గడువు సమీపిస్తోంది. ఇప్పటికే జూలై నెల చివరికొచ్చింది. ఇక, మరో రెండు నెలలే సమయం ఉండడంతో కేంద్రంపై ఒత్తిడి పెంచడంతో పాటు ఎన్నికలకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసే పనిలో పడింది.