అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | రుణాల పంపిణీలో లక్ష్యాలు పూర్తి చేయడంతో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి బ్యాంకర్లు కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సర రుణ ప్రణాళిక (year loan plan) విడుదల చేశారు.
వ్యవసాయ అనుబంధ, వ్యవసాయేతర, ఇతర అన్ని రంగాలకు కలిపి రూ.17,990 కోట్ల రుణాలు అందించాలని నిర్ణయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పలు బ్యాంకులు రుణ లక్ష్యాలు చేరుకుంటుండగా, మరికొన్ని వెనుకంజలో ఉన్నాయన్నారు. అన్ని బ్యాంకులు కూడా వంద శాతం లక్ష్యం చేరుకోవాలన్నారు. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు అందుబాటులో ఉన్న రుణ వసతిపై అవగాహన కల్పించి, అర్హత కలిగిన వారికి రుణాలు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను (banking services) సమర్ధవంతంగా అందించాలని ఆదేశించారు. వీధి వ్యాపారులకు సూక్ష్మ రుణాలు త్వరగా మంజూరు చేయాలన్నారు.
ఇందిరా మహిళా శక్తి సంఘాల్లో (Indira Mahila Shakti Sangam) 60 ఏళ్లు పైబడిన వారికి కూడా బ్యాంకు ఖాతాలు తెరిచి, అవసరమైన వారికి రుణాలు అందించాలని సూచించారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది దివ్యాంగులు సభ్యులుగా ఉన్న సంఘాలకూ బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు అనుమతించాలన్నారు. ఇంకా పలు అంశాలపై సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్‌బిఐ అధికారి రాములు, డీఆర్డీఓ సాయగౌడ్, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ అశోక్ చవాన్, నాబార్డ్ ఏజీఎం ప్రవీణ్ కుమార్, బ్యాంకర్లు పాల్గొన్నారు.