అక్షరటుడే ఆర్మూర్: SriramSagar Project | బాబ్లీ గేట్లు ఎత్తిన అనంతరం జలాలు శ్రీరాంసాగర్‌కు చేరుకున్నాయి. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు ఈనెల 1న మహారాష్ట్రలోని బాబ్లీ గేట్లను (Babli Gates) తెలంగాణ, మహారాష్ట్ర (Maharashtra) ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా తెరిచారు. మొత్తం 14 గేట్లను ఎత్తగా 0.35 టీఎంసీల నీరు శ్రీరాం సాగర్‌కు వస్తోంది.
SriramSagar Project | 80 కి.మీ. ప్రయాణించి..
బాబ్లీ గేట్లు ఎత్తిన అనంతరం వరద సుమారు 80 కి.మీ దూరం ప్రయాణించి ఎస్సారెస్పీలో ఆ నీరు కలుస్తుంది. బాబ్లీ నుంచి కందకుర్తి(Kandakurthi), బాసర(Basara), నాలేశ్వర్, జీజీ నడ్కుడ మీదుగా 80 కిలోమీటర్ల దూరంలోని ఎస్సారెస్పీలోకి చేరుతుంది. అక్టోబర్ 29 వరకు బాబ్లీ గేట్లను తెరిచి ఉంచనున్నారు. గతేడాది బాబ్లీ ద్వారా 293 టీఎంసీల నీరు వచ్చినట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కొత్త రవి తెలిపారు.
SriramSagar Project | 60 టీఎంసీలకు చేరగానే సాగుకు..
గతేడాది ఎస్సారెస్పీలోకి మొత్తం 293 టీఎంసీల వరద వచ్చింది. ఇందులో నుంచి 288 టీఎంసీల నీటిని కాకతీయ, లక్ష్మి, సరస్వతి, వరద కాలువ, గోదావరి ద్వారా విడుదల చేశారు. ప్రాజెక్టు పరిధిలోని 6,24,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందింది. వరద కాలువ ద్వారా మిడ్ మానేరు, లోయర్ మానేర్ డ్యామ్‌లకు నీరు తరలించారు.
ఈ ఏడాది ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ 60 టీఎంసీలకు చేరగానే సాగునీటి విడుదల విషయమై ప్రణాళికలు రూపొందించనున్నారు. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 11.440 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం 17.974 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 5,477 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. వర్షాలు పడుతుండడం.. ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ఆశాజనకంగా ఉండడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.