అక్షరటుడే, వెబ్‌డెస్క్: Apache Helicopters | సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అపాచీ హెలికాప్టర్లు (Apache helicopters) భారత్‌కు చేరుకున్నాయి. తొలి విడత బ్యాచ్‌లో మూడు అత్యాధునిక హెలికాప్టర్లు మంగళవారం హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నట్లు ఇండియన్ ఆర్మీ (Indian Army) తెలిపింది.
ప్రపంచంలోని అత్యంత అధునాతన దాడి హెలికాప్టర్లలో ఒకటైన AH-64E అపాచీ (AH-64E Apache).. శత్రు యుద్ధ క్షేత్రాల్లో శక్తివంతమైన దాడులను చేసేలా తయారు చేశారు. అమెరికా రక్షణ దిగ్గజం బోయింగ్ రూపొందించిన ఈ అత్యాధునిక హెలికాప్టర్‌ను భారత్‌కు విక్రయించేందుకు 2015లోనే ఒప్పందం కుదిరింది. అయితే, వీటి అందజేతకు సుదీర్ఘ సమయం పట్టింది. ఎట్టకేలకు తొలి విడుత బ్యాచ్ భారత్‌కు చేరుకుంది.
Apache Helicopters | తొలి విడతలో మూడు అపాచీలు..
అమెరికా నుంచి అందిన అపాచీ హెలికాప్టర్ల తొలి బ్యాచ్ ఎట్టకేలకు అసెంబుల్ చేయడం, జాయింట్ రిసీప్ట్ ఇన్‌స్పెక్షన్ (Joint Receipt Inspection) (JRI), ఇండక్షన్ వంటి ఇతర విధానాలను ప్రొటోకాల్ ప్రకారం పాటిస్తామని భారత సైన్యం తెలిపింది. విమానాశ్రయంలో మూడు అపాచీ అటాక్ హెలికాప్టర్‌లను స్వీకరించినట్లు భారత సైన్యం తెలిపింది. వీటిని జోధ్‌పూర్‌లో మోహరించనున్నారు. “భారత సైన్యం కోసం అపాచీ అటాక్ హెలికాప్టర్ల (Apache attack helicopters) తొలి బ్యాచ్ భారతదేశానికి చేరుకుంది. ఈ హెలికాప్టర్లను భారత సైన్యం జోధ్‌పూర్‌లో మోహరిస్తుందని భారత ఆర్మీ అధికారులు తెలిపారు.
Apache Helicopters | అత్యంత శక్తివంతమైన చాపర్లు..
శక్తివంతమైన 30 mm చైన్ గన్‌తో కూడిన సాయుధ అపాచీ హెలికాప్టర్లు, ఖచ్చితమైన దాడుల కోసం లేజర్- రాడార్-గైడెడ్ హెల్‌ఫైర్ క్షిపణులను, బహుళ గ్రౌండ్ టార్గెట్‌లను ఢీకొట్టగల రాకెట్ పాడ్‌లను కలిగి ఉంటాయి. ఇది శత్రువుల రాడార్‌కు చిక్కకుండా ప్రయాణించగలదు. అలాగే, శత్రువుల నుంచి వచ్చే ముప్పును ముందే పసిగట్టగలదు. అత్యాధునికమైన ఈ చాపర్లను ప్రస్తుతం అమెరికా, యూకే, ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలు వినియోగిస్తుండగా, భారత్ ఇప్పుడు ఆయా దేశాల సరసన చేరింది.
2015లో చేసుకున్న ఒప్పందం ప్రకారం భారత వైమానిక దళం (Indian Air Force) కోసం 22 అపాచీ హెలికాప్టర్‌లను ఇండియా కొనుగోలు చేసింది. భారత సైన్యానికి చెందిన ఏవియేషన్ కార్ప్స్ కోసం ఆరు చాపర్లను కేటాయించింది. ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ గత సంవత్సరం మార్చిలో 25 కొత్త ALH హెలికాప్టర్ల కోసం ఒప్పందంపై సంతకం చేసింది.