అక్షరటుడే, వెబ్‌డెస్క్: AP Liquor Scam case | ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసులో (Liquor Scam Case) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) దర్యాప్తు మరింత వేగం పెంచింది. ఈ కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని (YCP MP Mithun Reddy) శనివారం అరెస్ట్ చేసింది. గత రాత్రి నుంచే మిథున్ రెడ్డి సిట్ కార్యాలయంలోనే ఉన్నారు. ఆదివారం ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు. విచారణ అనంతరం అధికారికంగా అరెస్ట్ చేసినట్లు సిట్ శనివారం రాత్రి నోటీసులు ఇచ్చింది. దీంతో లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు అరెస్ట్ అయినవారి సంఖ్య 12కి చేరింది. ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణలో ఇది కీలక పరిణామంగా మారింది.
AP Liquor Scam case | జగన్‌కి తెలిసే..
ఇక లిక్కర్ కేసులో సిట్ 305 పేజీల ఛార్జ్‌షీట్‌ను న్యాయస్థానంలో దాఖలు చేసింది. ఛార్జ్‌షీట్‌కు తోడు 70 అడిషనల్ వాల్యూమ్స్‌ని జత చేశారు. ఇందులో లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించిన జీవోలు, బ్యాంక్ స్టేట్మెంట్లు (bank statements), ఎఫ్ఎస్ఎల్ నివేదికలు ఉన్నాయి. ఇక తాజా ఛార్జ్‌షీట్‌లో (Charge Sheet) ఎనిమిది మందిని కొత్తగా నిందితులుగా చేర్చడంతో, మొత్తం నిందితుల సంఖ్య 48కి పెరిగింది. వీరిలో చాలామంది దేశం విడిచి వెళ్లినట్టు గుర్తించామని సిట్ పేర్కొంది. సిట్ అధికారులు ఛార్జ్‌షీట్‌లో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పేరును పలుసార్లు ప్రస్తావించడం గమనార్హం.
ఛార్జ్‌షీట్లో యాడ్ చేసిన ఎనిమిది మందిలో సైమన్ ప్రసన్, కొమ్మారెడ్డి అవినాశ్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రన్, మోహన్, రాజీవ్ ప్రతాప్, బొల్లారం శివకుమార్, ముప్పిడి అవినాష్ రెడ్డి ఉన్నారు. సిట్ అధికారులు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఛార్జ్‌షీట్‌లో పలుమార్లు ప్రస్తావించారు. లిక్కర్ స్కామ్ జగన్‌కు (YS Jagan Mohan Reddy) తెలియకుండా జరగదని పేర్కొన్నారు. అయితే, ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పేర్లు మాత్రం ఈ ఛార్జ్‌షీట్‌లో లేవు. వారిపై సమాచారం వచ్చే దశలో మరోసారి చార్జ్‌షీట్‌లో చేర్చుతామని సిట్ తెలిపింది. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది. మిథున్ రెడ్డి అరెస్ట్, జగన్ ప్రస్తావనతో ఈ కేసులో తర్వాత ఏం జరగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.