అక్షరటుడే, వెబ్‌డెస్క్: America | అగ్రరాజ్యం అమెరికా (America)లో మరోసారి తుపాకుల మోత మోగింది. దుండుగుల కాల్పుల్లో నలుగురు మృతి చెందగా.. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి చికాగోలో ఈ ఘటన చోటు చేసుకుంది. చికాగో (Chicago)లోని రివర్ నార్త్ ప్రాంతంలోని ఓ నైట్‌క్లబ్‌లో జరుగుతున్న పార్టీపై అగంతకులు కాల్పులకు తెగబడ్డారు. ఓ వాహనంలో వచ్చిన నిందితులు నైట్‌క్లబ్ (Night Club) వెలుపల గుమికూడిన జనంపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
America | తరచూ కాల్పులు
అమెరికాలో తరుచూ కాల్పులు చోటు చేసుకుంటాయి. సామాన్య జనంపై దుండగులు ఫైరింగ్ చేస్తారు. కారణం లేకుండానే కాల్పులకు తెగబడిన ఘటనలు ఉన్నాయి. కొందరైతే మానసిక సమస్యలతో ప్రజలపై గతంలో కాల్పులు చేశారు. దీనికి ప్రధాన కారణం అమెరికాలో విచ్చలవిడిగా తుపాకులు, గన్లు అందుబాటులో ఉండటమే.
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన అగ్రరాజ్యంలో మనుషుల కంటే తుపాకులే ఎక్కువ ఉండటం గమనార్హం. ఎవరికి పడితే వారికి గన్లు ఇస్తుండటంతో అక్కడ తరుచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ దేశాల మధ్య జరిగే యుద్ధాలను ఆపామని చెప్పుకునే అమెరికా తమ దేశంలో జరిగే కాల్పులను ఆపకపోవడం గమనార్హం. యేటా ఇలాంటి ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు పోతున్నా చర్యలు చేపట్టకపోవడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.