అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగళం చిక్కింది. లంచం పేరిట ప్రజలను పీడీస్తున్న ఓ తహశీల్దార్ (Tahsildar)ను ఏసీబీ అధికారులు (ACB Officers) మంగళవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఓ వ్యక్తి తన పేరుమీద, కుటుంబ సభ్యుల పేరిట ఉన్న భూమి రిజిస్ట్రేషన్ కోసం రంగారెడ్డి (Rangareddy) జిల్లా తలకొండపల్లి తహసీల్దారు (Talakondapalli Tahsildar) నాగార్జునను కలిశాడు. దీంతో ఆయన 22 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.10 వేల లంచం అడిగాడు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మంగళవారం లంచం తీసుకుంటుండగా.. తహశీల్దార్ నాగార్జునతో పాటు కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ యాదగిరిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ACB Raid | రెవెన్యూలో మారని తీరు
రెవెన్యూ శాఖ (Revenue Department)లో అవినీతి రాజ్యమేలుతోంది. ముఖ్యంగా పలు తహశీల్దార్ కార్యాలయాలు అవినితీ కేంద్రాలుగా మారాయి. ఆయా ఆఫీసుల్లో లంచం ఇవ్వకపోతే కనీసం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్(FMC certificate) కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. అటెండర్, ఆపరేటర్ నుంచి మొదలు పెడితే తహశీల్దార్ల వరకు లంచాలు తీసుకుంటున్నారు. కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారిని లంచాల పేరిట పట్టి పీడిస్తున్నారు. ముఖ్యంగా తహశీల్దార్ ఆఫీసుల్లో పలువురు సిబ్బంది అయితే లంచం తీసుకోవడం కూడా ఒక డ్యూటీగా భావిస్తుండటం గమనార్హం.
ACB Raid | ఫిర్యాదు చేయండి.. అండగా ఉంటాం
ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడుతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.