అక్షరటుడే, నిజాంసాగర్: Anganwadi Center | నిజాంసాగర్ (Nizamsagar) మండలంలో అంగన్వాడీ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా ఆయా కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు ఇష్టారీతిన విధులు నిర్వర్తిస్తున్నారు.
మహమ్మద్ నగర్ (Mohammad Nagar) మండలకేంద్రంలోని అంగన్వాడీ కేంద్రానికి (Anganwadi Center) బుధవారం పిల్లలెవరూ లేరు. సదరు అంగన్వాడీ టీచర్ ఇటీవలే ఉద్యోగ విరమణ (Anganwadi Teacher Retirement) పొందగా, ఆయా విధులు నిర్వహిస్తోంది. కాగా.. ఆయా బంధువులు కేంద్రానికి వచ్చి కేంద్రంలోని సరుకులు ఇంటికి తీసుకెళ్లడం కనిపించింది.
Anganwadi Center | సిబ్బంది ఇష్టారాజ్యం..
ఇలా.. మండలవ్యాప్తంగా అంగన్వాడీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. టీచర్లు, ఆయాలు సమయపాలన పాటించడం లేదు. ఇష్టారీతిన కేంద్రాలు తెరుస్తున్నారు. సమయానికి ముందే మూసివేస్తున్నారు. కొన్నిచోట్ల రోజుల తరబడి కేంద్రాలు మూసి ఉంటున్నాయి. ఉమ్మడి నిజాంసాగర్ మండలంలో చాలావరకు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు లేకున్నా.. ఉన్నట్లు రిజిస్టర్ల(Registers)లో నమోదు చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో ఒకరిద్దరు పిల్లలే ఉన్నా.. రికార్డులో పదిమంది వరకు ఉన్నట్లు రాస్తున్నారు. వారి పేరు మీద వచ్చిన సరుకులను పక్కదారి పట్టిస్తున్నారు.
Anganwadi Center | అధికారుల పట్టింపేది..!
ఉమ్మడి నిజాంసాగర్ మండలవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై సీడీపీవో (CDPO) నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ప్రభుత్వం ఓవైపు చిన్నారులకు, కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని సూచిస్తోంది. వివిధ పథకాలు అమలు చేస్తూ లబ్ధిదారుల సంఖ్య పెంచాలని ఆదేశిస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మండలంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై దృష్టి పెట్టాలని, విధులు సక్రమంగా నిర్వహించనివారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.