అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Emergency Number | తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట అన్ని అత్యవసర సేవలకు ఒకే నంబర్ తీసుకు వచ్చారు. ఏ ఆపదలో ఉన్న ఎమర్జెన్సీ నంబర్ (Emergency Number) 112కు ఫోన్ చేస్తే ఇకనుంచి సాయం అందనుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ అవసరాల నిమిత్తం పలు అత్యవసర ఫోన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పోలీసుల కోసం డయల్ 100కు, ఫైర్ ఇంజిన్ కోసం 101, అంబులెన్స్ కోసం 108కు ఫోన్ చేయాలి. అయితే వీటన్నింటికి ఇక నుంచి ఒకే నంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుంది. దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డయల్ 112 ను ప్రవేశపెట్టింది. తాజాగా తెలంగాణలో పోలీసులు దీనిని అమలు చేస్తున్నారు. దీంతో 112కి కాల్ చేస్తే అన్ని అత్యవసర సేవలు అందనున్నాయి. పోలీస్, ఫైర్, రోడ్డు ప్రమాదాలు, మెడికల్, మహిళలు, పిల్లల అత్యవసర సేవలకు 112 నంబర్‌ను అమలు చేస్తూ రాష్ట్ర పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్యానిక్ బటన్ (Panic Button) నొక్కితే నేరుగా 112కు కాల్ వెళ్తుంది.
Emergency Number | అందే సేవలు
ఎమర్జెన్సీ నంబర్ 112కి కాల్ చేస్తే పోలీస్, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళలు, పిల్లల భద్రత, విపత్తు సహాయం అందనున్నాయి. 24 గంటల పాటు ఈ నంబర్ అందుబాటులో ఉంటుంది. GPS-ఆధారిత వాహనాల ద్వారా వేగవంతమైన ప్రతిస్పందన ఉంటుంది. పోలీస్, అగ్నిమాపక, వైద్య, విపత్తు సేవలు ఈ నంబర్‌కు కాల్ చేసి పొందవచ్చు. ఆపదలో ఉన్న మహిళలు, పిల్లలకు సైతం రక్షణ అందించనున్నారు.
Emergency Number | ఎలా పనిచేస్తుంది
మనం ఏదైనా నంబర్ నుంచి 112 కి కాల్ చేస్తే వెంటనే ప్రతిస్పందన వస్తుంది. అంతేగాకుండా మొబైల్ జీపీఎస్ ఆధారంగా మనం ఉన్న ప్లేస్‌ను ట్రాక్ చేస్తారు. అవసరాన్ని బట్టి సమీపంలో ఉన్న పెట్రోలింగ్ వాహనం, అగ్నిమాపక వాహనం, అంబులెన్స్ పంపిస్తారు.