అక్షరటుడే, వెబ్‌డెస్క్: Air India Flight | ఎయిరిండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ముంబైలో ల్యాండ్ అవుతున్న విమానం రన్‌వే పక్కకు దూసుకెళ్లింది. ముంబై విమానాశ్రయం(Mumbai Airport)లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఉదయం 9.27 గంటలకు కొచ్చి నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం AI-2744 ల్యాండ్ అయినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. A320 విమానం (VT-TYA) రన్‌వే 27ను తాకింది కానీ వేగం తగ్గిన సమయంలో రన్‌వేపై నుంచి కిందకు వెళ్లిపోయింది. భారీ వర్షం కారణంగా ఎయిర్ ఇండియా విమానం (Air India Flight) ల్యాండ్ అవుతుండగా రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లింది. A320 విమానం ప్రధాన 27వ రన్‌వే నుండి జారి, చదును చేయని ప్రాంతంలోకి దూసుకెళ్లి ఆపై టాక్సీవేపైకి వెళ్లి ఆగిపోయింది. అయితే, విమానం కొంత దెబ్బ తిన్నప్పటికీ, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Air India Flight | రన్‌వే మూసివేత..
విమానం రన్‌వే (Airplane Runway) పక్కకు దూసుకెళ్లిన అనంతరం ప్రధాన రన్‌వేను మూసి వేశారు. విమానం రన్‌వే పక్కకు దూసుకెళ్లడంతో మూడు టైర్లు పేలిపోయాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విమానాశ్రయం ప్రాథమిక రన్‌వే – 09/27 కూడా స్వల్పంగా దెబ్బ తిన్నట్లు పేర్కొన్నాయి. విమానాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా కార్యకలాపాల కొనసాగింపునకు ద్వితీయ రన్‌వే – 14/32ను వినియోగిస్తున్నట్లు ముంబై విమానాశ్రయ ప్రతినిధి తెలిపారు.
మరోవైపు, ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ బృందం విమానాశ్రయానికి చేరుకుంది. కొచ్చి నుంచి వచ్చిన విమానం ముంబైలో ల్యాండ్ అవుతుండగా భారీ వర్షం(Heavy Rain) కురిసిందని, దీంతో ల్యాండింగ్ తర్వాత రన్‌వే నుంచి పక్కకు వెళ్లిందని ఎయిరిండియా ప్రతినిధి (Air India Representative) తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు.
Air India Flight | వరుస ఘటనలతో ఆందోళన
అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 270 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం అనంతరం విమానాల్లో సాంకేతిక సమస్యలు వస్తుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక సమస్యలతో విమానాలు రన్‌వేపై నిలిచిపోవడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండడంతో ఫ్లైట్ ఎక్కాలంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇటీవల ఓ విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య రావడంతో పైలెట్ పాన్ కాల్ ఇచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇలాంటి ఘటనలతో విమాన ప్రయాణికులు భయపడుతున్నారు. విమానాలను ముందుగానే పూర్తిగా తనిఖీ చేసి ప్రయాణానికి అనుమతించాలని కోరుతున్నారు.