అక్షరటుడే, నిజామాబాద్: Kalthi Kallu | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు దందా జోరుగా సాగుతోంది. నిషేధిత అల్ప్రాజోలం (banned Alprazolam) ఇతర మత్తు పదార్థాలు వినియోగించి కృత్రిమ కల్లును తయారు చేస్తున్నారు. ఈ కల్లు తాగి బానిసగా మారిన వారు పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధి బారిన పడుతున్నారు. అయినా కల్తీ కల్లు తయారీకి మాత్రం అడ్డుకట్ట పడట్లేదు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad) కల్తీకల్లు తాగి తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. అలాగే పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని (Nizamabad district) బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిజామాబాద్ పట్టణాల పరిధిలో పలువురు కల్తీ కల్లు మృత్యువాత పడిన ఘటనలు వెలుగు చూశాయి. అయితే అప్పట్లో కల్లు దుకాణాల్లో తనిఖీలు చేసి హడావుడి చేసిన ఎక్సైజ్ అధికారులు (excise officials) ఆ తరువాత పట్టించుకోవడం లేదు. ఫలితంగా కల్తీకల్లు తయారీ యథేచ్ఛగా సాగుతోంది. ముఖ్యంగా ప్రాణాలకు అత్యంత ప్రమాదకరమైన అల్ప్రాజోలం, క్లోరో హైడ్రేట్, యూరియా, షాక్రిన్ తదితర రసాయనాలను కలిపి కృత్రిమ కల్లును తయారు చేస్తున్నారు. దీనికి బానిసలుగా మారిన వారికి దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ప్రత్యేకించి, నరాల, మెదడు సంబంధిత వ్యాధులతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రత్యేకించి పల్లెల్లో యువత ఈ కల్లుకు బానిసలుగా మారుతుండడం ఆందోళన కలిగించే విషయం.
Kalthi Kallu | మూకుమ్మడి తనిఖీలు
కల్తీ కల్లు ఘటనలు వెలుగుచూసిన ప్రతీసారి ఎక్సైజ్ అధికారులు మొక్కుబడి తనిఖీలు చేపడుతున్నారు. అనంతరం చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారు. బహిరంగంగానే కల్తీ కల్లును తయారు చేస్తున్నారు. హానికర రసాయనాలతో (harmful chemicals) మిషన్లు ద్వారా ప్యాకెట్ల రూపంలో కల్లు తయారు చేసి విక్రయిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. తనిఖీల సమయంలో కల్తీకల్లు దొరికినప్పటికీ అందుబాటులో ఉన్న ల్యాబ్‌లలో మాత్రం శాంపిళ్లలో ఏమీ లభించట్లేదని నివేదికలు రావడం గమనార్హం.
మరోవైపు నెలవారీ మామూళ్లు తీసుకుంటున్న అధికారులు తనిఖీలకు సంబంధించి కల్లు వ్యాపారులకు ముందస్తుగానే సమాచారం ఇచ్చి.. జాగ్రత్త పడేలా చేస్తున్నారు. అధికారులే వెన్నంటి ఉండడంతో కల్తీకల్లు దందాకు అడ్డుకట్ట పడట్లేదని తెలుస్తోంది.
Kalthi Kallu | అల్ప్రాజోలం తరలిస్తున్నదెవరు..!
నిషేధిత అల్ప్రాజోలాన్ని (banned Alprazolam) ఎక్కువగా మహారాష్ట్ర నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల కమిషనరేట్ పోలీసులు మహారాష్ట్రలో అల్ప్రాజోలం తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున అల్ప్రాజోలం, ముడిసరుకు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ అల్ప్రాజోలం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. జిల్లాకు సరిహద్దున మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కొందరు అల్ప్రాజోలాన్ని నిల్వ చేసి కల్తీకల్లు తయారీ దారులకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కాగా.. ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులు (Excise and Police Department officials) సమన్వయం చేసుకుని ముందుకు సాగితే కట్టడి చేయవచ్చు.