అక్షరటుడే, వెబ్‌డెస్క్: Warangal Congress | కొండా సురేఖ భర్త కొండా మురళి(Konda Murali)పై చర్యలు తీసుకోవాల్సిందేనని ఉమ్మడి వరంగల్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Warangal Congress MLA) డిమాండ్ చేశారు. ఇటీవల కొండా దంపతులు, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మధ్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే కొండా మురళి వ్యాఖ్యలు చేయడంతో వరంగల్ కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. కొండా దంపతులకు వ్యతిరేకంగా మిగతా ఎమ్మెల్యేలు ఏకమై అధిష్టానికి ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యేల ఫిర్యాదు మేరకు కొండా మురళి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. మరోసారి కొండా సురేఖ(Konda Surekha), మురళి దంపతులు కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో గురువారం కొండా వ్యతిరేక వర్గంతో క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. కమిటీ ముందుకు రావాలి అంటేనే అవమానంగా ఉందన్నారు. తిట్లు తిన్నది తామే అని, కమిటీ కూడా తమనే పిలవడం దేనికి సంకేతమని వారు ప్రశ్నించారు. ఇచ్చిన ఫిర్యాదు మీదనే వివరాలు అడిగేందుకు పిలిచినట్లు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి(Committee Chairman Mallu Ravi) వారికి సర్ది చెప్పారు. కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఎమ్మెల్యేలు పట్టుబట్టినట్లు సమాచారం. లేదంటే తమకూ ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని వారు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
Warangal Congress | కొండా మురళి వ్యాఖ్యలతో..
ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్(Warangal Congress)లో ఎప్పటి నుంచి కోల్డ్‌వార్ నడుస్తోంది. అయితే కొన్ని రోజుల క్రితం కొండా మురళి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి(Kadiyam Srihari), రేవూరి ప్రకాశ్‌రెడ్డి(Revuri Prakash Reddy)పై వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది. కోల్డ్ వార్ కాస్త పెద్దదిగా మారి.. ఎమ్మెల్యేలందరూ కొండా దంపతులకు వ్యతిరేకంగా ఏకం అయ్యారు. ఈ మేరకు పలుమార్లు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు సమావేశమై కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే మండుతున్న వరంగల్ రాజకీయాల్లో కొండా సురేఖ కూతురు సుష్మిత పటేల్ ట్వీట్ పెట్రోల్ పోసినట్లు అయింది. ఆమె పరకాల నుంచి పోటీ చేస్తానని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఉన్నారు. కొండా మురళి సైతం ప్రకాశ్‌రెడ్డి ఎన్నికల ముందు తమ కాళ్ల మీద పడడంతో గెలిపించామని గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ సైతం తన కూతురులో రాజకీయ రక్తం ప్రవహిస్తోందన్నారు. ఆమె రాజకీయ ఆకాంక్షలను అడ్డుకునే అధికారం తమకు లేదని చెప్పారు. ఈ క్రమంలో వరంగల్ కాంగ్రెస్‌లో రోజు రోజుకు ముదురుతున్న పోరును క్రమశిక్షణ కమిటీ దారికి తెస్తుందేమో చూడాలి.