అక్షరటుడే, కామారెడ్డి: Lingampet | బాలికను మోసం చేసి లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) వివరాలు వెల్లడించారు. 2022 జూలై 2న లింగంపేట మండలం ముస్తాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి తన పిల్లలతో కలిసి ఆరుబయట నిద్రించారు. రాత్రి 10 గంటల సమయంలో లేచిచూడగా ఆయన 14ఏళ్ల కూతురు కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల వెతికిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణలో లింగంపేట మండలం గాంధీనగర్ (Gandhi Nagar)కు చెందిన శ్రీకాంత్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ మైనర్ బాలికను పరిచయం చేసుకున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నానంటూ వేధించాడు. జూలై 2న బాలికకు ఫోన్ చేసి బయటకు రావడానికి ఒప్పించి బైక్పై మేడ్చల్ (Medchal) జిల్లా దబిల్పూర్కు (Dabilpur) తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే పోలీసులు తనను వెతుకుతున్నారనే భయంతో బాలికను అదేనెల 6న లింగంపేట పోలీస్స్టేషన్ (Lingampeta Police Station) ఎదుట వదిలి పరారయ్యాడు. అయితే పోలీసులు అతడిని పట్టుకుని పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించగా.. బుధవారం న్యాయమూర్తి నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్ష, రూ.60వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్పీ తెలిపారు.