అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raids | రాష్ట్రంలో ఏసీబీ (ACB) దూకుడు పెంచింది. గతంలో ఫిర్యాదులకు సంబంధించి ట్రాప్‌లు కేసులు నమోదు చేసే ఏసీబీ ప్రస్తుతం అవినీతి, అక్రమాలు జరుగుతున్న శాఖలపై దృష్టి పెట్టింది. ఆయా శాఖల కార్యాలయాలపై ఆకస్మికంగా దాడులు చేస్తోంది. దీంతో అవినీతి అధికారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఏసీబీ ఓ గురుకుల పాఠశాల (Gurukul School)లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.
పాఠశాలలు, హాస్టళ్లలో గతంలో విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారులు మాత్రమే తనిఖీలు జరిపేవారు. కానీ ప్రస్తుతం ఏసీబీ అధికారులు కూడా దాడులు చేస్తున్నారు. గత నెల 27న నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని బీసీ హాస్టల్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తాజాగా మహబూబాబాద్ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో బుధవారం అధికారులు దాడులు చేపట్టారు.
ACB Raids | భారీగా అక్రమాలు
గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య కంటే అధికంగా హాజరు నమోదు చేసి బిల్లులు డ్రా చేస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా నాసిరకం సరుకులతో విద్యార్థులకు వంటలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. తాజాగా ఏసీబీ అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్, సానిటరీ ఇన్స్పెక్టర్ తదితర అధికారులతో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో పలు కీలక అంశాలు గుర్తించారు. హాస్టల్‌లో అక్రమాలు, అదనపు హాజరు, రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేకపోవడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఏసీబీ అధికారులు తెలిపారు.
ACB Raids | వరుస దాడులతో ఉక్కిరి బిక్కిరి
ఏసీబీ అధికారులు ఇటీవల వరుసగా దాడులు చేపడుతున్నారు. దీంతో అవినీతి అధికారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బుధవారం ఒక్కరోజే ఏసీబీ మూడు ప్రాంతాల్లో దాడులు చేయడం గమనార్హం. కామారెడ్డి జిల్లా పొందుర్తి చెక్‌పోస్టు (Pondurthi Check Post)లో దాడులు చేసిన అధికారులు డ్రైవర్ల నుంచి డబ్బులు తీసుకుంటున్న అధికారులు, ఏజెంట్లను పట్టుకున్నారు. అలాగే బదిలీ కోసం లంచం తీసుకుంటున్న పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ (Panchayat Raj ENC) వీరవల్లి కనకరత్నంను అరెస్ట్ చేసింది. గురుకుల పాఠశాలలో తనిఖీలు చేపట్టి అక్రమాలపై కేసు నమోదు చేసింది. ఏసీబీ అధికారుల దూకుడుతో అవినీతి అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ తాము దొరుకుతామో అని భయపడుతున్నారు. కానీ లంచాలు తీసుకోవడం మాత్రం మానడం లేదు.