అక్షరటుడే, వెబ్డెస్క్ : Railway Line Doubling | ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి నిత్యం వేలాది మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి నిజామాబాద్ మీదుగా హైదరాబాద్ నడిచే రైళ్లలో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ మార్గంలో డబ్లింగ్(Doubling) పనులు చేపట్టాలని గతంలో రైల్వేశాఖ(Railway Department) నిర్ణయించింది. తాజాగా ఇందుకు సంబంధించి నిజామాబాద్ జిల్లా(Nizamabad District) పరిధిలో భూ సేకరణ ప్రక్రియ పూర్తయింది.
Railway Line Doubling | ముథ్కేడ్ నుంచి డోన్ వరకు..
మహారాష్ట్రలోని ముథ్కేడ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా డోన్ రైల్వే స్టేషన్ వరకు రైల్వే ట్రాక్ డబ్లింగ్ పనులకు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రద్దీ అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో మరో లైన్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా 417.88 కి.మీ.ల పొడవున్న ముథ్కేడ్-డోన్ రైల్వే లైన్ డబ్లింగ్(Mudkhed-Dhon Railway Line Doubling) ప్రాజెక్టుకు రూ.4,686.09 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. డబ్లింగ్తో బల్హర్షా-కాజీపేట-సికింద్రాబాద్, కాజీపేట-విజయవాడ మధ్య ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.
Railway Line Doubling | భూసేకరణ పూర్తి
డబ్లింగ్ పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రైల్వే శాఖ ప్రారంభించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిధిలో భూసేకరణ పూర్తయినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ(Railway Ministry) పేర్కొంది. భూ సేకరణ వివరాలను రెవెన్యూ అధికారుల వద్ద ఉంచారు. భూసేకరణపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలోని ఇందల్వాయి, నడిపల్లి, బర్దీపూర్ గ్రామాల్లో 42 మందికి సంబంధించిన భూమిని సేకరించారు.